దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులను జైలు నుంచి విడుదలను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. ఈ తీర్పును పున: సమీక్షించాలని కోరింది.
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులను జైలు నుంచి విడుదలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. వీరి విడుదలపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది కేంద్రం. విడుదలపై పున: పరిశీలించాలని కోరింది. రాజీవ్ హత్య కేసులో 30 ఏళ్లకు పైగా శిక్షను అనుభవించిన దోషులను విడుదల చేయాలని కొద్దిరోజుల క్రిందట సుప్రీంకోర్ట్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇతర కేసుల్లో జైలు శిక్ష అవసరం లేకుంటే వారిని విడుదల చేయాలని సూచించింది. సుప్రీం ఆదేశాల మేరకు తమిళనాడులోని వెల్లూరు జైలు నుంచి నిందితులు విడుదలయ్యారు.
ఇకపోతే.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసుల్లో ఈ నెలలోనే విడుదలైన ఆరుగురు దోషుల్లో నలుగురు శ్రీలంక వాసులు ఉన్నారు. ఆ నలుగురు శ్రీలంక పౌరులను వారి దేశానికి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నట్టు తమిళనాడు అధికారులు సోమవారం తెలిపిన సంగతి తెలిసిందే. రాజీవ్ గాంధీ హంతకులను సత్ప్రవర్తనపై విడుదల చేయాలని 2016లో తమిళనాడు ప్రభుత్వం కోరింది. తాజాగా, ఈ నెల 11వ తేదీన వారిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ మరుసటి రోజే వెల్లూరి సెంట్రల్ జైలు నుంచి ఆరుగురు రాజీవ్ గాంధీ హంతకులు విడుదలయ్యారు. దీంతో ఆ నలుగురు శ్రీలంక పౌరులను ప్రత్యేక శరణార్థుల శిబిరానికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే వేలూరు జైలు నంచి విడుదల తర్వాత ఈ శిబిరానికి తీసుకెళ్లినట్టు తిరుచ్చి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ALso Read:రాజీవ్ హంతకులను వదిలేస్తారా.. కరెక్ట్ కాదు : వెంకయ్య నాయుడు కామెంట్స్
కాగా.. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో 1991 మే నెలలో రాజీవ్ గాంధీ ఎన్నికల క్యాంపెయిన్ చేస్తుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో రాజీవ్ గాంధీని లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) అనే శ్రీలంకన్ గ్రూప్ హతమార్చింది. ఈ ఆత్మాహుతి దాడిని ఎల్‌టీటీఈ ప్రతీకార దాడిగా పేర్కొంటూ ఉంటారు. 1987లో శ్రీలంకకు ఎల్‌టీటీఈని అణచివేయడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇండియన్ పీస్ కీపర్స్‌ను పంపించింది. ఈ యుద్దంలో 1,200 మంది మరణించిన తర్వాత వారిని తిరిగి వెనక్కి పిలుచుకుంది. శ్రీలంకలో మానవ హక్కులను దారుణంగా హననం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఇండియన్ పీస్ కీపర్లను అప్పటి భారత కేంద్ర ప్రభుత్వం వెనక్కి రప్పించుకుంది. తాజాగా సుప్రీం ఆదేశాలతో రాజీవ్ హత్య కేసులో దోషులైన నళిని, ఆమె భర్త మురుగన్ అలియాస్ శ్రీహరన్, సంతన్, జయకుమార్, రవిచంద్రన్, రాబర్ట్ పయస్‌లకు భారీ ఊరట లభించింది.
