Lok Sabha Election 2024: ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పార్లమెంట్ ఎన్నికలు 2024,   రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను నిర్వహణకు సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఎన్నిక నిర్వహణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Lok Sabha Election 2024: దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల నిర్వహణ దిశ‌గా అడుగులు వేగంగా ప‌డుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు ఏప్రిల్ మొదటి వారంలో లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌వ‌చ్చని అంచనాలు వేస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి కూడా ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌వ‌చ్చని ప్రకటించారు. ఇలా ఎప్పుడప్పుడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల సంఘం (సీఈసీ)కూడా ఇదే రీతిలో ప్ర‌క‌ట‌న చేసింది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌ర్వ‌స‌న్న‌ద్ధంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించింది.

ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఒడిశాలోని భువ‌నేశ్వ‌ర్‌లో శనివారం విలేక‌ర్ల‌తో మాట్లాడారు. లోక్‌స‌భ‌తోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామ‌ని తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికలు, ఒడిశా అసెంబ్లీని నిర్వహించడానికి తాము తమ శాయశక్తులా కృషి చేశామని ఎన్నికల సంఘం , మీడియా ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఎన్నికలు.. సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ ప్రజాస్వామ్య పండుగలో ఖచ్చితంగా పాల్గొనాలని ఒడిశా ఓటర్లందరికీ విజ్ఞప్తి చేశారు. 2024 ఏప్రిల్‌, మే నెల‌ల్లో లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. దీంతోపాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిశా, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా లోక్‌స‌భ‌ ఎన్నిక‌లతో పాటు నిర్వ‌హిస్తామని తెలిపారు. 

మహిళలు, వృద్ధ ఓటర్లపై దృష్టి 

ఎన్నికల కమిషన్ చీఫ్ ప్రకారం.. ఒడిశా అసెంబ్లీలో 3.32 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు, వారిలో 1.68 కోట్ల మంది పురుష ఓటర్లు, మహిళా ఓటర్ల సంఖ్య 1.64 కోట్లు. ఈసారి ఓటరు జాబితాను మరింత సమగ్రంగా రూపొందించేందుకు ప్రయత్నించాం. ఈసారి కూడా 3,380 మంది థర్డ్ జెండర్ ఓటర్లను ఓటరు జాబితాలో చేర్చామని తెలిపారు. 37809 పోలింగ్‌ కేంద్రాల్లో 22,685 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాట్లు చేయనున్నామని, వికలాంగులు, యువకులు, మహిళలపై ప్రధానంగా దృష్టి సారించామని చెప్పారు.

'కోర్టు తీర్పుపై పని చేస్తా'

కాగా, ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన మాట్లాడుతూ.. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌కు సంబంధించి సుప్రీంకోర్టు సూచనల మేరకు మాత్రమే ఎన్నికల సంఘం పనిచేస్తుందని అన్నారు. ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ సమాచార ప్రవాహం, భాగస్వామ్యంలో పారదర్శకత ఆధారంగా పని చేస్తామని తెలిపారు.

ఓటింగ్ ఎన్ని దశల్లో జరుగుతుంది?

2014 లోక్‌సభ ఎన్నికలకు 9 దశల్లో ఓటింగ్ జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 7 దశల్లో ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు 2024 లోక్‌సభ ఎన్నికలు ఎన్ని దశల్లో నిర్వహించాలనే దానిపై ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. 

NDA vs I.N.D.I.A. పోటీ

2024 లోక్‌సభ ఎన్నికలలో ప్రధాన పోటీ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ), ప్రతిపక్ష పార్టీల కూటమి 'ఇండియా'మధ్య పోటీ ఉండనున్నది. ఎన్నికల విషయంలో బీజేపీ తనకూ, ఎన్డీయేకూ టార్గెట్ పెట్టుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో 370 సీట్లు సాధించడమే బీజేపీ లక్ష్యమని, 400కు పైగా సీట్లు గెలవడమే ఎన్డీయే లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఓ బహిరంగ సభలో చెప్పారు.