Asianet News TeluguAsianet News Telugu

ఉజ్బెకిస్తాన్ లో పిల్లల మరణాలపై స్పందించిన సీడీఎస్ సీవో.. ఫార్మా కంపెనీపై విచారణ ప్రారంభం..

భారతీయ ఔషద కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ ల తాగడం వల్ల 18 మంది మరణించారని ఉజ్జెకిస్తాన్ ప్రకటించిన నేపథ్యంలో సీడీఎస్ సీవో విచారణకు ఆదేశించింది. ఆ దగ్గు తయారీ కంపెనీపై గురువారం దర్యాప్తు ప్రారంభించింది. 

CDSCO who reacted to the deaths of children in Uzbekistan.. Inquiry has started against the pharma company..
Author
First Published Dec 29, 2022, 2:14 PM IST

భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన దగ్గు మందు వికటించి ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారులు చనిపోయిన ఘటనపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీవో) స్పందించింది. ఇండియాకు చెందిన ఔషధ సంస్థ మారియన్ బయోటెక్ లిమిటెడ్ తయారు చేసిన డాక్ 1-మాక్స్ దగ్గు మందు తాగడం వల్ల 18 మంది చిన్నారులు మరణించారని ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ  ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించిందని అధికారిక వర్గాలు తెలిపాయి. 

ఈ మరణాలకు దారితీసిన దగ్గు సిరప్ నమూనాలను ఇప్పటికే సేకరించినట్లు నోయిడాకు చెందిన కంపెనీ మారియన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ లీగల్ పర్సన్ హసన్ హారిస్ గురువారం తెలిపారు. ఈ సంస్థ 2012లో ఉజ్బెకిస్తాన్ లో నమోదు చేయబడింది. ఉజ్బెకిస్థాన్ లో మరణాలు ఎలా సంభవించాయో ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని, ఆ నివేదిక నిజానిజాలను వెల్లడిస్తుందని పేర్కొన్నారు. ‘‘మా వైపు నుంచి ఎలాంటి సమస్య లేదు. పరీక్షలు అన్నీ కరెక్టుగానే ఉన్నాయి. మేము గత పదేళ్లుగా అక్కడ ఉన్నాం. ప్రస్తుతానికి తయారీ ఆగిపోయింది’’ అని ఆయన అన్నారు.

సీడీఎస్ సీవో ఉత్తరప్రదేశ్ డ్రగ్స్ కంట్రోల్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ సంయుక్త బృందం రెండు రోజుల క్రితం నోయిడాలోని తయారీ యూనిట్ ను తనిఖీ చేసింది. నమూనాలను ఇప్పటికే పరీక్షల కోసం పంపారు. గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) ఉల్లంఘనలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా.. ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ 21 మంది పిల్లలలో 18 మంది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారని, వారంతా భారతీయ కంపెనీ మారియన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన డాక్ -1 మాక్స్ సిరప్ తీసుకున్నారని తెలిపింది. 

‘‘ మరణించిన పిల్లలు హాస్పిటల్ లో చేరడానికి ముందు ఈ మందును ఇంట్లోనే  2-7 రోజులు పాటు రోజుకు 3-4 సార్లు, 2.5-5 మిల్లీ లీటర్లు తీసుకున్నారని తెలిసింది. ఇది పిల్లల ప్రామాణిక మోతాదును మించిపోయింది’’ అని ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ‘‘ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పిల్లలందరికీ మందు ఇచ్చారు. ఔషధంలో ప్రధాన భాగం పారాసెటమాల్ కాబట్టి, డాక్ -1 మాక్స్ సిరప్ ను తల్లిదండ్రులు సొంతంగా లేదా ఫార్మసీ అమ్మకందారుల సిఫార్సు మేరకు యాంటీ కోల్డ్ రెమెడీగా తప్పుగా ఉపయోగించారు. రోగుల పరిస్థితి క్షీణించడానికి ఇదే కారణం.’’ అని తెలిపింది. 

కాగా.. ప్రాథమిక ప్రయోగశాల అధ్యయనాలు డాక్ -1 మాక్స్ సిరప్ శ్రేణిలో ఇథిలిన్ గ్లైకాల్ ఉందని తేలింది. ఈ పదార్ధం విషపూరితమైనది. 95 శాతం సాంద్రీకృత ద్రావణం కిలోకు 1-2 మిల్లీ లీటర్ వల్ల రోగిలో వాంతులు, మూర్ఛ, హృదయ సంబంధ సమస్యలు, తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం తీవ్రమైన మార్పులకు కారణమవుతుంది. శిశు మరణాలను సకాలంలో విశ్లేషించడంలో ఫెయిల్ అయినందుకు, దానికి అవసరమైన చర్యలు తీసుకోనందుకు ఏడుగురు ఉద్యోగులను తొలగించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. డాక్ -1 మ్యాక్స్ మందు అన్ని మాత్రలు, సిరఫ్ లను దేశంలోని అన్ని ఫార్మసీలలో అమ్మకం నుండి ఉపసంహరించుకున్నామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే ఫార్మసీలలో మందులను కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను కోరింది. 

ఇటీవల న్యూఢిల్లీకి చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన దగ్గు సిరప్‌లు తాగి కనీసం గాంబియాలో 70 మంది చిన్నారులు మరణించారని ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఇదే తరహాలో ఉజ్బెకిస్థాన్ లో కూడా మరణాలు సంభవించాయి. ఈ మరణాలపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ.. ‘‘ మేడ్ ఇన్ ఇండియా దగ్గు సిరప్‌లు ప్రాణాంతకంగా కనిపిస్తున్నాయి. మొదట గాంబియాలో 70 మంది చిన్నారులు, ఇప్పుడు ఉజ్బెకిస్థాన్‌లో 18 మంది చిన్నారులు చనిపోయారు. భారతదేశం ప్రపంచానికి ఫార్మసీగా ఉందని మోడీ సర్కార్ ప్రగల్భాలు పలకడం మానుకొని బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలి ’’ అని తెలిపారు. 

అయితే గాంబియా పిల్లల మరణాలతో ముడిపడి ఉన్న మైడెన్ ఫార్మా నుండి సేకరించిన నమూనాలు ప్రామాణిక నాణ్యతతో ఉన్నాయని భారత ప్రభుత్వం పార్లమెంటులో తెలిపింది. గాంబియా ప్రభుత్వం కూడా పిల్లల మరణాలకు, భారతీయ దగ్గు మందులకు మధ్య ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేసినప్పటికీ.. ది గాంబియాలోని పార్లమెంటరీ కమిటీ దగ్గు సిరప్ తయారీ సంస్థ మైడెన్ ఫార్మాస్యూటికల్ పై ప్రాసిక్యూషన్ కు సిఫారసు చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios