సీబీఎస్ఈ వచ్చే ఏడాది సిలబస్‌లో కీలక మార్పులు చేసింది. కొత్త సిలబస్ నుంచి డెమోక్రసీ అండ్ డైవర్సిటీ, పారిశ్రామిక విప్లవం, అలీనోదమ్యం, ముఘల్స్ కోర్టులు సహా పలు టాపిక్స్‌ను తొలగించింది. సిలబస్‌ను క్రమబద్ధీకరించడంలో భాగంగా ఈ టాపిక్స్‌ను తొలగించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. 

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) కొన్ని కీలక టాపిక్స్‌ను సిలబస్ నుంచి తొలగించింది. 11వ తరగతి, 12వ తరగతి పొలిటికల్ సైన్స్, హిస్టరీ సబ్జెక్టుల నుంచి అలీన ఉద్యమం, ప్రచ్ఛన్న యుద్ధ కాలం, ఆఫ్రో ఆసియా ప్రాంతాల్లో ఇస్లాం రాజ్య విస్తరణ, ముఘల్స్ కోర్టులు, పారిశ్రామిక విప్లవం టాపిక్స్‌ను తొలగించింది. ఇదే విధంగా పదో తరగతి సిలబస్ నుంచి ఫుడ్ సెక్యూరిటీ చాప్టర్‌లో వ్యవసాయంపై ప్రపంచీకరణ ప్రభావం టాపిక్‌ను డ్రాప్ చేసింది. అలాగే, రిలీజియన్, కమ్యూనలిజం, పాలిటిక్స్ - కమ్యూనలిజం, సెక్యూలర్ స్టేట్ సెక్షన్‌లో ప్రసిద్ధ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవితలను తొలగించారు. 

అదే విధంగా సీబీఎస్ఈ డెమోక్రటసీ అండ్ డైవర్సిటీ టాపిక్స్‌నూ సిలబస్ నుంచి తొలగించడం గమనార్హం. అయితే, ఈ అంశాలను పాఠ్యాంశాల జాబితా నుంచి తొలగించడానికి గల కారణాలను ఆరా తీయగా సిలబస్ క్రమబద్ధీకరణలో భాగంగా వీటిని తొలగించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సిఫారసులకు లోబడి ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education) 10, 12 వ తరగతుల టర్మ్‌ 2 పరీక్షలు ఏప్రిల్‌ 26 నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ బోర్టు శుక్రవారం ప్రకటించింది. 10వ తరగతి పరీక్షలు మే 24వ తేదీన ముగియనుండగా.. 12వ తరగతి పరీక్షలు జూన్ 15న ముగియనున్నాయి. పరీక్షలను ఆఫ్ లైన్‌ మోడ్‌లోనే నిర్వహించనున్నట్టుగా సీబీఎస్‌ఈ బోర్డు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. సీబీఎస్‌ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ cbse.gov.in, cbse.nic.in వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉంచినట్టుగా బోర్టు తెలిపింది.

ఇక, కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో 2021-2022 విద్యా సంవత్సరం 10,12 తరగతుల బోర్డు పరీక్షలను రెండు టర్మ్‌లుగా నిర్వహించాలని సీబీఎస్‌ఈ బోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ టర్మ్‌ ఎగ్జామ్స్‌ గతేడాది నవంబర్‌‌, డిసెంబరులలో పూర్తి అయ్యాయి. ఇప్పుడు టర్మ్ 2 పరీక్షల షెడ్యూల్‌ను సీబీఎస్‌ఈ బోర్టు విడుదల చేసింది. సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌లో ఉండే సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని బోర్డ్‌ విద్యార్థులకు సూచించింది.