Asianet News TeluguAsianet News Telugu

యూపీఏ హయాంలో ఫేక్ ఎన్‌కౌంటర్ కేసులో మోడీని ఇరికించడానికి సీబీఐ నాపై ఒత్తిడి చేసింది: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నదన్న ప్రతిపక్ష పార్టీ ఆరోపణలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. యూపీఏ హయాంలోనే మోడీని ఓ ఫేక్ ఎన్‌కౌంటర్ కేసులో ఇరికించడానికి సీబీఐ నన్ను టార్గెట్ చేసిందని వివరించారు.
 

cbi put pressure on me to frame narendra modi says union home minister amit shah kms
Author
First Published Mar 30, 2023, 12:57 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ సీబీఐపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ హయాంలో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు.. ఆయనపై ఓ ఫేక్ ఎన్‌కౌంటర్ కేసు నమోదైందని గుర్తు చేశారు. ఆ కేసులో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీపై అభియోగాలు మోపడానికి తనపై సీబీఐ తీవ్ర ఒత్తిడి పెట్టిందని వివరించారు. 

న్యూస్ 18 రైజింగ్ ఇండియా కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దర్యాప్త సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని, ఆ ఆరోపణలపై స్పందించాలని విలేకరులు కోరగా.. కేంద్ర మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గుజరాత్‌లో ఓ ఫేక్ ఎన్‌కౌంటర్ కేసులో నరేంద్ర మోడీని ఇరికించడానికి సీబీఐ నాపై తీవ్ర ఒత్తిడి చేసిందని ఆరోపించారు. అయినప్పటికీ బీజేపీ ఆందోళనలకు పాల్పడలేదని వివరించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పై స్పందిస్తూ .. ఇలా కోర్టులో దోషిగా తేలి చట్టసభల్లో స్థానాలు కోల్పోయిన నేతుల ఎందరో మంది ఉన్నారని పేర్కొన్నారు. 

రాహుల్ గాంధీ ఆ తీర్పును అప్పీల్ చేస్తూ పైకోర్టులకు వెళ్లాల్సిందని అన్నారు. దానికి బదులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బ్లేమ్ చేయడం మొదలు పెట్టారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు భావనాలను ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు.

Also Read: రాహుల్ గాంధీ‌పై యూకే కోర్టులో కేసు వేస్తానని లిత్ మోదీ హెచ్చరిక.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు..

అసలు ఆయన కన్విక్షన్‌పైనే రాహుల్ గాంధీ స్టే తీసుకోలేదని వివరించారు. ఇది ఎలాంటి గర్వం అని పేర్కొన్నారు. ఎంపీగా కొనసాగాలని చెబుతుంటావ్.. కోర్టుకూ వెళ్లబోనని పేర్కొంటూ ఉంటావ్.. ఇది ఎలా సాధ్యం అని తెలిపారు. రాహుల్ గాంధీ ఫుల్ స్పీచ్ వినాలని కోరారు. అది కేవలం మెడీని అవమానించడమే కాదు.. మొత్తం మోడీ వర్గాన్ని, ఓబీసీ సమాజాన్ని దూషించినట్టుగా ఉన్నదని పేర్కొన్నారు. 

రాహుల్ గాంధీపై అనర్హత వేటులో కుట్రపూరిత రాజకీయాలేవీ లేవని అన్నారు. ఇది మన దేశ చట్టాల్లో భాగమేనని వివరించారు. వారి పాలన కాలంలోనే సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆదేశాలకు లోబడే ఆయనపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios