New Delhi: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ కార్యాలయానికి విచార‌ణ‌కు పిలిపించారు. దీనిపై రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ మాజీ నేత కపిల్ సిబల్ స్పందిస్తూ కేజ్రీవాల్ కు మద్దతుగా నిలిచారు. కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు జారీ చేయడం రాజకీయ ప్రేరేపితమని ఆయన అన్నారు. 

Delhi Excise Policy case: ఢిల్లీ మ‌ద్యం పాలసీ కుంభ‌కోణం కేసు సంచ‌ల‌నాల‌కు మారుపేరుగా మారుతోంది. ఇప్ప‌టికే ఆప్ కు చెందిన కీల‌క నాయ‌కుల‌ను సీబీఐ విచార‌ణ త‌ర్వాత అదుపులోకి తీసుకుంది. తాజాగా ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆదివారం నాడు సీబీఐ ముందు హాజ‌ర‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే స్పందించిన ఓ కాంగ్రెస్ మాజీ నాయ‌కుడు కేజ్రీవాల్ కు మ‌ద్ద‌తుగా నిలిచారు. సీబీఐ నోటీసుల‌ను రాజ‌కీయ ప్రేరేపితంగా పేర్కొన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఆదివారం దేశ రాజధానిలోని సీబీఐ కార్యాలయానికి పిలిపించారు. ఈ విషయంలో రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ మాజీ నేత కపిల్ సిబల్ కేజ్రీవాల్ కు మద్దతు పలికారు. కేజ్రీవాల్ కు సీబీఐ నుంచి సమన్లు రావడం రాజకీయ ప్రేరేపితమని ఆయన అన్నారు. 

'సీబీఐ సమన్లు రాజకీయ ప్రేరేపితం'

కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు జారీ చేయడం రాజకీయ ప్రేరేపితమే అనడంలో ఎలాంటి సందేహం లేదని మాజీ కాంగ్రెస్ నేత, సీనియర్ అడ్వకేట్, రాజ్యసభ సభ్యుడు క‌పిల్ సిబాల్ అన్నారు. 'సిసోడియాను ఇంతకాలం జైల్లో ఎందుకు ఉంచారు? జైన్ ను ఇంతకాలం జైల్లో ఎందుకు ఉంచారు? దేనికోసం? వారు ఏ ప్రయోజనం కోసం పనిచేస్తున్నారు? అని ఘాటుగా స్పందిస్తూ ప్ర‌శ్న‌లు కురిపించారు.

వ్యవస్థ మొత్తం కుప్పకూలడం దురదృష్టకరం.. 

"100 కోట్లు లంచం తీసుకున్నారని సీబీఐ తెలిపింది. లంచం తీసుకున్న ఏ ఒక్క ప్రభుత్వోద్యోగి పేరు చెప్పగలరా? ఏ ఒక్కరి పేరు కూడా చెప్పలేదు. కోర్టులు సిసోడియాకు ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మొత్తం వ్యవస్థ కుప్పకూలడం దురదృష్టకరం" అని సిబాల్ అన్నారు. 

నిరసన తెలుపుతున్న ఆప్ కార్యకర్తలు..

మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ ను సీబీఐ విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. మరోవైపు పార్టీ అధినేత కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఆప్ కార్యకర్తలు ఆదివారం దేశ రాజధానిలో ఆందోళనకు దిగారు. కాశ్మీరీ గేట్ వద్ద పలువురు ఆప్ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బీజేపీపై సీఎం ఆగ్రహం

అరవింద్ కేజ్రీవాల్ అవినీతిపరుడైతే, ఈ ప్రపంచంలో ఎవరూ నిజాయితీపరులు కాదని ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ తనను విచారణకు పిలిచిన మరుసటి రోజే ఢిల్లీ ముఖ్యమంత్రి అన్నారు. ఆదివారం నాడు ఆయ‌న సీబీఐ ఎదుట హాజ‌ర‌య్యారు. అంత‌కుముందు బీజేపీపై ప‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు.