అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ఎన్ శుక్లాపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. రూ. 2.45 కోట్లు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై కేసు నమోదైంది. ఈ న్యాయమూర్తిపై ఇది రెండో అవినీతి కేసు.
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ఎన్ శుక్లాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అవినీతి కేసు నమోదు చేసింది. రూ. 2.45 కోట్ల విలువైన ఆస్తులు ఆదాయానికి మించి ఉన్నాయి. ఈ ఆస్తులకు ఆదాయ మూలాలేవీ చూపించిన కారణంగా కేసు నమోదైంది. జడ్జీ ఎస్ఎన్ శుక్లా 2014 నుంచి 2019 కాలంలో హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్న కాలంలో ఈ ఆస్తులను కూడబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఆ న్యాయమూర్తి పై ఇది రెండో అవినీతి కేసు కావడం గమనార్హం.
2019 డిసెంబర్ 4వ తేదీన సీబీఐ జడ్జీ ఎస్ఎన్ శుక్లాపై కేసు ఫైల్ చేసింది. అప్పుడు అతను సిట్టింగ్ జడ్జీ. న్యాయమూర్తి ఎస్ఎన్ శుక్లాతోపాటు ఛత్తీస్‌గడ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జీ ఐఎం ఖుద్దుసీతోపాటు మరో నలుగురిపైనా కలిపి కేసు నమోదు చేసింది. లక్నోలో ఓ మెడికల్ కాలేజీకి అనుకూలంగా ఆర్డర్ పాస్ చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది.
Also Read: కరోనాకు భయపడి మూడేళ్లుగా ఇంట్లోనే వివాహిత.. భర్తను కూడా రానివ్వలేదు.. తలుపులు పగులగొట్టిన అధికారులు
ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ వేసింది. జస్టిస్ ఎస్ఎన్ శుక్లా వైపు తప్పిదాలు ఉన్నట్టు ఈ కమిటీ తేల్చింది. దీంతో ఆ న్యాయమూర్తిపై అభిశంసన చేపట్టాలని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా 2018లో సిఫారసు చేశారు. కానీ, అది రూపం దాల్చలేదు. ఆ తర్వాత సీజేఐగా బాధ్యతలు తీసుకున్న జస్టిస్ రంజన్ గొగోయ్ కూడా ఈ విషయంపై కేంద్రంతో ఫాలో అప్ చేశారు. అయినప్పటికీ ఆ న్యాయమూర్తిపై అభిశంసన ప్రయోగించలేదు.
2020 జులైలో జస్టిస్ ఎస్ఎన్ శుక్లా రిటైర్ అయ్యారు.
