ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి మరోసారి చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి ఈడీకి లొంగిపోతానని ఆయన చెప్పినప్పటికీ... అందుకు కోర్టు అంగీకరించకపోవడం గమనార్హం. ఐఎన్ఎక్స్ మీడియాకి సంబంధించి అక్రమ నగదు చలామణి కేసులో ఈడీకి లొంగిపోతానంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేసింది.

ఈడీకి లొంగిపోయేందుకు అవకాశమివ్వాలంటూ చిదంబరం గురువారం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే... అక్రమ నగదు చలామణీ కేసులో చిదంబరాన్ని అరెస్టు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ... ఇప్పుడే చేయమని ఈడీ న్యాయస్థానానికి తెలియజేసింది. సమయం వచ్చినప్పుడు తామే అరెస్టు చేస్తామని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో ఆయన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది.

ఇదిలా ఉంటే..ఐఎన్ఎక్స్ మీడియా కేసులో గత నెలలో చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనను కోర్టు జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించింది. ఈ నెల 19వరకు ఆయన తీహార్ జైల్లో ఉండనున్నారు. అయితే... సీబీఐ కేసులో బెయిల్ కోసం చిదంబరం గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు వేశారు. దీనిపై ఈ నెల 23వ తేదీన విచారణ జరగనుంది.