వ్యాప్కోస్ మాజీ చీఫ్ రాజిందర్ గుప్తా, కుమారుడు గౌరవ్ ను అరెస్టు చేసిన సీబీఐ.. ఎందుకంటే ?
మాజీ బ్యూరోక్రాట్ వ్యాప్కోస్ మాజీ చైర్మన్ రాజిందర్ కుమార్ గుప్తా, ఆయన కుమారుడు గౌరవ్ ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ బుధవారం అరెస్టు చేశారు. అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఈడీ మంగళవారం గుప్తా కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసింది.
వ్యాప్కోస్ మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజిందర్ కుమార్ గుప్తా, ఆయన కుమారుడు గౌరవ్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ గా పిలిచే ఈ వ్యాప్కోస్ ఓ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇది జల్ శక్తి మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉంటుంది.
అయితే 2011 ఏప్రిల్ 01 నుంచి 2019 మార్చి 31 వరకు సంస్థలో అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై గుప్తా, ఆయన భార్య రీమా సింఘాల్, కుమారుడు గౌరవ్ సింఘాల్, కోడలు కోమల్ సింఘాల్లపై ఈడీ కేసు నమోదు చేసింది. మంగళవారం సోదాలు కూడా ప్రారంభించింది. ఎఫ్ఐఆర్ అనంతరం సీబీఐ బృందాలు ఢిల్లీ, గురుగ్రామ్, చండీగఢ్, సోనిపట్, ఘజియాబాద్లోని 19 ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టి భారీ మొత్తాన్ని గుర్తించాయి.
మంగళవారం జరిపిన సోదాల్లో రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని, బుధవారం నాటికి అది రూ.38 కోట్లకు చేరిందని సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. నగదుతో పాటు పెద్ద మొత్తంలో నగలు, విలువైన వస్తువులు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సర్వీసు నుంచి రిటైర్ అయిన తర్వాత ఈ మాజీ బ్యూరోక్రాట్, ఆయన కుటుంబం ఢిల్లీలో ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీ వ్యాపారాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుల స్థిరాస్తుల్లో ఫ్లాట్లు, వాణిజ్య ఆస్తులు, ఢిల్లీ, గురుగ్రామ్, పంచకుల, సోనిపట్, చండీగఢ్ లలో విస్తరించి ఉన్న ఫాంహౌస్ లు ఉన్నాయి.