కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం ఇంట్లో సోదాలకు సంబంధించి సీబీఐ అధికారిక ప్రకటన చేసింది. చిదంబరం, భాస్కర్ రామం, వికాస్ మకారియా, తల్వండి సాబూ పవర్ లిమిటెడ్, బెల్ టూల్స్ కంపెనీలలోనూ తనిఖీలు నిర్వహించినట్లు సీబీఐ వెల్లడించింది.

కాంగ్రెస్ (congress) సీనియర్ నేత, చిదంబరం (chidambaram) ఇంట్లో సోదాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) (cbi) మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. పవర్ ప్రాజెక్ట్ వ్యవహారంలో సోదాలు చేశామని సీబీఐ (cbi raids) తెలిపింది. చిదంబరం ఇంటితో పాటు పది చోట్ల తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొంది. ఢిల్లీ, చెన్నై, ముంబై, కర్ణాటక, ఒడిశా, పంజాబ్‌లో సోదాలు జరిపినట్లు చెప్పింది. చిదంబరం, భాస్కర్ రామం, వికాస్ మకారియా, తల్వండి సాబూ పవర్ లిమిటెడ్, బెల్ టూల్స్ కంపెనీలలోనూ సోదాలు నిర్వహించినట్లు సీబీఐ వెల్లడించింది. అలాగే ప్రాజెక్ట్ వీసాల వ్యవహారంలో చిదంబరం ఇంట్లో సీబీఐ సోదాలు జరిపింది. 

సోదాల సందర్భంగా ఐఎన్‌ఎక్స్ కేసు విచారణ సమయంలో కార్తీకి సంబంధించిన అంతర్గత, బాహ్య లావాదేవీలకు సంబంధించిన కొన్ని పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే పంజాబ్‌లోని Talwandi Sabo Power ప్రాజెక్ట్‌కు సంబంధించి చైనా కార్మికులకు వీసాలు ఇప్పించడంలో కార్తీ ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది. అయితే సీబీఐ సోదాల నేపథ్యంలో కార్తీ చిదంబరం ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలా ఎన్నిసార్లు జరిగిందో లెక్క మరిచిపోయానని అన్నారు. ఇది రికార్డు అయి ఉంటుంది అని ట్వీట్ చేశారు. ఇక, కార్తీ చిదరంబం ప్రస్తుతం తమిళనాడులోని శివగంగ నుంచి ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

Also Read:ఇలా ఎన్నిసార్లు జరిగిందో.. లెక్క మర్చిపోయాను: సీబీఐ సోదాలపై కార్తీ చిదంబరం

కార్తీ చిదంబరం.. రూ. 305 కోట్ల మేరకు విదేశీ నిధులను స్వీకరించడానికి ఐఎన్‌ఎక్స్ మీడియాకు ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ అనుమతికి సంబంధించి అనేక క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలో చిదంబరం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇక, 2017 మే 15న ఐఎన్ఎక్స్ మీడియాపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. ఈ క్రమంలోనే సీబీఐ.. కార్తీ చిదంబరంను 2018 ఫిబ్రవరిలో అరెస్టు చేసింది. అయితే ఒక నెల తర్వాత మార్చిలో అతనికి బెయిల్ లభించింది.