ఎమర్జెన్సీ విధించిన రోజైన జూన్ 25ను ఎప్పటికీ మర్చిపోలేమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశ చరిత్రలో అదొక చీకటి కాలం అని అన్నారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 102వ ఎపిసోడ్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా బిపార్జోయ్ తుఫానును విజయవంతంగా ఎదుర్కొన్న గుజరాత్ ప్రజల ధైర్యాన్ని ప్రధాని మోడీ కొనియాడారు. గురువారం (జూన్ 15) గుజరాత్ లో తీరాన్ని తాకిన తుఫాను కారణంగా జరిగిన నష్టాలను టీమ్ వర్క్ తగ్గించిందని ప్రధాని ఉద్ఘాటించారు.
అస్సాంలో వరదల బీభత్సం.. కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి.. 37,000 మంది ప్రభావితం
‘‘కొన్నేళ్లుగా భారత్ అభివృద్ధి చేసిన విపత్తు నిర్వహణ శక్తి నేడు ఆదర్శంగా నిలుస్తోంది.బిపార్జోయ్ తుఫాను కచ్ లో చాలా విధ్వంసం సృష్టించింది, కానీ కచ్ ప్రజలు దానిని పూర్తి ధైర్యంతో, సన్నద్ధతతో ఎదుర్కొన్నారు’’ అని ప్రధాని మోడీ అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ భారత ప్రజాస్వామ్యాన్ని ప్రశంసించారు. ‘‘భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి అన్నారు. జూన్ 25ను మనం మరచిపోలేం. ఎమర్జెన్సీ విధించిన రోజు. భారత దేశ చరిత్రలో ఇదొక చీకటి కాలం. లక్షలాది మంది ఎమర్జెన్సీని సర్వశక్తులు ఒడ్డి వ్యతిరేకించారు. ఆ సమయంలో ప్రజాస్వామ్య మద్దతుదారులు ఎంతగా హింసించబడ్డారంటే నేటికీ మనసు వణికిపోతోంది. ఈ రోజు మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నప్పుడు ఇలాంటి నేరాలను కూడా గమనించాలి. ఇది యువ తరాలకు ప్రజాస్వామ్యం అర్థం. ప్రాముఖ్యతను నేర్పుతుంది’’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
యూపీలోని హాపూర్ జిల్లాలో ప్రజలు అంతరించిపోయిన నదిని పునరుద్ధరించారని ప్రధాని మోడీ అన్నారు. ఈ నది మూలాన్ని అమృత్ సరోవరంగా కూడా అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ‘‘నిర్వహణ విషయానికి వస్తే ఛత్రపతి శివాజీ వైపు చూడాలి. ఆయన ధైర్యసాహసాలతో పాటు ఆయన పాలన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అతని నిర్వహణ నైపుణ్యాలు ముఖ్యంగా నీటి నిర్వహణ, నౌకాదళం ఇప్పటికీ భారతదేశానికి గర్వకారణంగా ఉన్నాయి’’ అని ప్రధాని తన రేడియో కార్యక్రమంలో అన్నారు.
కాగా.. ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించే తన నెలవారీ రేడియా కార్యక్రమం ఈ సారి ముందుగానే ప్రసారం అయ్యింది. సాధారణంగా ప్రతీ నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమం అవుతుంది. అయితే ఈ నెల చివరి ఆదివారం జూన్ 25వ తేదీ వస్తున్న నేపథ్యంలో మన్ కీ బాత్ షెడ్యూల్ ను మార్చారు, ఆ సమయంలో ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉంటారు.
ముందే ఈ విషయాన్ని ట్వీట్ చేసిన ప్రధాని మోడీ..
ఈసారి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని 2023 జూన్ 18న ప్రసారం చేయనున్నట్లు ప్రధాని మోదీ జూన్ 13న ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రజల నుంచి ఆయన సలహాలను ఆహ్వానించారు. ‘‘ఈ నెల మన్ కీ బాత్ కార్యక్రమం జూన్ 18వ తేదీ ఆదివారం జరగనుంది. మీ సలహాలు అందుకోవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. నమో యాప్, మైగవ్ లో మీ ఇన్ పుట్ లను పంచుకోండి లేదా 1800-11-7800 డయల్ చేయడం ద్వారా మీ సందేశాన్ని రికార్డ్ చేయండి.’’ అని పేర్కొన్నారు. కాగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నారు.
