వీడి సావర్కర్ దేశ భక్తుడు అని, సంఘ సంస్కర్త అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొనియాడారు. ఆయనకు సంబంధించిన పాఠాలను సిలబస్ నుంచి తొలగించడం సరైంది కాదని పరోక్షంగా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు.
హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ సంఘ సంస్కర్త, దేశభక్తుడని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఆయన పాఠాలు, అలాగే ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవార్ పై ఉన్న అధ్యాయాలను పాఠశాల సిలబస్ నుంచి తొలగించడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
ఆదిపురుష్ వివాదం : సినిమాను జాతీయ స్థాయిలో నిషేధించాలని ఛత్తీస్ గఢ్ లో ఆందోళన
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో శనివారం ఏర్పాటు చేసిన ‘వీర్ సావర్కర్-పుస్తకావిష్కరణ’ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ పాల్గొని మాట్లాడారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన వ్యక్తి సావర్కర్ అని ఆయన కొనియాడారు. ఆయన కుటుంబం అవమానాలను ఎదుర్కోవడం దురదృష్టకరమని గడ్కరీ అన్నారు. హిందుత్వం అంతా సమ్మిళితమైందని, కులతత్వం, మతతత్వం లేనిదని సావర్కర్ చెప్పారని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
సావర్కర్ సంఘ సంస్కర్త అని, ఆయన మనకు ఆదర్శమని నితిన్ గడ్కరీ కొనియాడారు. డాక్టర్ హెడ్గేవార్, సావర్కర్లకు సంబంధించిన అధ్యాయాలను పాఠశాల సిలబస్ నుంచి తొలగించడం చాలా దురదృష్టకరమని, ఇంత బాధాకరమైన విషయం మరొకటి లేదని గడ్కరీ ఎవరి పేరును ప్రస్తావించకుండా అన్నారు. తనకు సత్సంబంధాలున్న ఒక జాతీయ నాయకుడు సావర్కర్ ను విమర్శించినప్పుడు ఆయన గురించి తెలియకుండా సావర్కర్ ను విమర్శించవద్దని ఆ నేతకు చెప్పానని గడ్కరీ గుర్తు చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని, ఇకపై సావర్కర్ గురించి తాను వ్యాఖ్యానించబోనని చెప్పారని అన్నారు.
గుజరాత్, యూపీలో ముస్లింలను టార్గెట్ చేస్తున్నారు - అసదుద్దీన్ ఒవైసీ
సావర్కర్, స్వామి వివేకానంద ప్రచారం చేసిన భారతీయ, హిందూ సంస్కృతి ఒకటేనని, వారి భావజాలం, దేశం కోసం సావర్కర్ చేసిన త్యాగాల గురించి యువతరానికి తెలియజేయాలని అన్నారు. కాగా.. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల పాఠశాల పాఠ్యపుస్తకాల నుంచి సావర్కర్, హెడ్గేవార్ అధ్యాయాలను తొలగించడం ద్వారా వివాదానికి తెరలేపింది. ఈ నేపథ్యంలోనే నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.
