rajasthan election 2023 : ముగిసిన ఎన్నికల ప్రచార గడువు.. రాజస్థాన్‌లో ఎల్లుండే పోలింగ్, సర్వం సిద్ధం
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కీలకమైన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచార గడువు ముగిసింది. దాదాపు 45 రోజులుగా జరుగుతున్న ప్రచారానికి గురువారంతో తెరపడింది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కీలకమైన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచార గడువు ముగిసింది. దాదాపు 45 రోజులుగా జరుగుతున్న ప్రచారానికి గురువారంతో తెరపడింది. ఇవాళ సాయంత్రం 6 గంటలతో ప్రచార గడువు ముగిసింది. దీంతో రాష్ట్రంలో నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. ఈ నెల 25న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఇక్కడ మొత్తం 200 నియోజకవర్గాలు వుండగా.. 199 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అయితే కరణ్‌పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న గుర్మీత్ సింగ్ కనూర్ ఆకస్మిక మరణంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఇక రాజస్థాన్‌లో ప్రచారం ముమ్మరంగా సాగింది. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, సీఎం అశోక్ గెహ్లాట్‌తో పాటు కీలక నేతలు ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రధాని నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ.. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత బిశ్వశర్మ తదితర నేతలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు.
మరోవైపు.. ఎన్నికల్లో నగదు ప్రవాహం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రూ.682 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు రాజస్థాన్ ఎన్నికల ప్రధానాధికారి ప్రవీణ్ గుప్తా వెల్లడించారు. చివరి 42 రోజుల్లో భారీగా నగదు, వస్తువులు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.