పురుషులకు మగతనం లేదని, నపుంసకుడు అంటూ వ్యాఖ్యలు చేస్తే.. వారిపై పరువు నష్టం కేసు వేసే అవకాశం ఉందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భార్యభర్త ల కేసు విషయంలో హైకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కేసు పూర్తి వివరాల్లోకి వెళితే... నాగ్ పూర్ కి చెందిన ఇద్దరు దంపతులు విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మహిళ తన  సొంత రాష్ట్రమైన ఏపీలో విడాకులు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ విడాకుల నేపథ్యంలో దంపతుల ఏకైక కుమార్తె సంరక్షణను తండ్రికి అప్పగించారు.

ఇది నచ్చని సదరు మహిళ మళ్లీ బాంబే హైకోర్టుకి చెందిన నాగ్ పూర్ న్యాయస్థానంలో మళ్లీ కేసు వేశారు. ఈ కేసు పిటిషన్ లో తన భర్తకు మగతనం లేదని, నపుంసకుడని ఆమె పేర్కొనడం గమనార్హం. కాగా.. దీనిపై భర్త తన భార్యపై పరువునష్టం కేసు దాఖలు చేశాడు.

ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం మహిళకు చివాట్లు పెట్టింది. పురుషులను నపుంసకుడు అనే పదంతో పిలిస్తే.. వారి పరువుకి నష్టం కలిగించినట్లేనని, దీనిపై చర్యలు తీవ్రతరంగా ఉంటాయని న్యాయస్థానం పేర్కొనడం విశేషం.

అయితే.. కోర్టు వ్యాఖ్యలపై సదరు మహిళ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘‘అగౌరపరచాలనే ఉద్దేశంతో అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మాకు పాప కూడా ఐవీఎఫ్ పద్దతి ద్వారానే పుట్టింది. అందుకే పాపను నాకు అప్పగిస్తారని అలా చెప్పాను’’ అని మహిళ వివరణ ఇచ్చింది.