పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జరిగిన నిరసనలు హింసకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లలో ఒక పోలీస్ కానిస్టేబుల్ సహా ఏడుగురు మరణించగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిలో డిప్యూటీ పోలీస్ కమీషనర్ అమిత్ శర్మ, ఏసీపీ, ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు సహా 11 మంది పోలీసు సిబ్బంది ఉన్నారని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఆందోళనల సమయంలో పోలీసులపై కాల్పులు జరిపిని ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read:ఒకవైపు ట్రంప్ పర్యటన... మరో వైపు ఢిల్లీలో అల్లర్లు.. నలుగురు మృతి

నిందితుడిని షాదార ప్రాంతానికి చెందిన 33 ఏళ్ల షారుఖ్‌గా గుర్తించారు. సోమవారం జఫ్రాబాద్ ప్రాంతంలో రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న ఓ వ్యక్తి ఆందోళనకారుల మధ్య నుంచి వచ్చి మరో వైపు ఆందోళన చేస్తున్న వారిపై కాల్పులు జరిపి తిరిగి గుంపులో కలిసిపోయాడు.

అతనిని గుర్తించి అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసును తుపాకీతో గురిపెట్టి బెదిరించాడని ఓ ప్రత్యక్ష సాక్షి పోలీసులకు తెలిపారు. దీనికి సంబంధించి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో షారుఖ్‌ను అదుపులోకి తీసుకుని, ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Also Read:ఢిల్లీలో అల్లర్లు, లూటీలు: 7కు చేరిన మృతుల సంఖ్య, మరోసారి షా భేటీ

మరోవైపు అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యున్నత సమీక్ష నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

కాగా.. అల్లర్ల నేపథ్యంలో జఫ్రాబాద్, మౌజ్‌పూర్-బాబర్‌పూర్ మార్గంలో మెట్రో సర్వీసులను అధికారులు తాత్కాలికంగా మూసివేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో నెల రోజుల పాటు 144 సెక్షన్ విధించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.