పౌరసత్వ సవరణ చట్టం పై కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా.. ఈ ఉద్రిక్తతలు సోమవారం తారా స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో దేశ రాజధానిలో హింస మొదలైంది.

అల్లర్లతో దేశ రాజధాని అట్టుడికింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.  మృతుల్లో ఒక కానిస్టేబుల్, ముగ్గురు పౌరులు ఉన్నారు. కాగా.. మరో 50మందికి పైగా గాయపడ్డారు.

ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్‌, మౌజ్‌పూర్‌ ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం మొదలైన అల్లర్లు సోమవారం కూడా కొనసాగాయి. ఇళ్లకు, షాపులకు, వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. రెండు వర్గాలవారు ఒకరిమీద మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. 

Also Read రెడ్ డ్రెస్‌తో తళుక్కుమన్న ఇవాంకా: ఇది రెండోసారి, కాస్ట్ ఎంతో తెలుసా..?.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకోగా, మరోవైపు ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలోని కొన్ని బస్తీల్లో యథేచ్ఛగా అల్లర్లు కొనసాగాయి. అల్లరిమూకలను చెదరగొట్టే క్రమంలో తలకు గాయమై హెడ్‌ కానిస్టేబుల్‌ రతన్‌లాల్‌ ప్రాణాలు కోల్పోగా, షాహ్‌దరా డీసీపీ అమిత్‌ శర్మ గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. 

హింసకు దిగిన అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించి లాఠీచార్జి చేశారు. అనేక ప్రాంతాల్లో 144వ సెక్షన్‌ను విధించారు.  మౌజ్‌పూర్‌, భజన్‌పురా, చాంద్‌బాగ్‌ ప్రాంతాల్లో అనేక షాపులు, ఇళ్లు, ఒక పెట్రోల్‌ పంప్‌కు నిరసనకారులు నిప్పుపెట్టారు. మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక వాహనానికి కూడా నిరసనకారులు నిప్పు పెట్టడం గమనార్హం.

అదనపు బలగాలను తరలించి, శాంతిభద్రతలను పునరుద్ధరించాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌కు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని, హింస ద్వారా సమస్యలు పరిష్కారం కావని ఆయన చెప్పారు. అల్లర్లను అదుపు చేయాల్సిందిగా బైజాల్‌ ఢిల్లీ పొలీసు కమిషనర్‌ను ఆదేశించారు.పలువురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.