ఢిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య గత రెండు రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు 9 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పోలీసులు, ఆందోళనకారులు బాధితులుగా ఉన్నారు.

అల్లర్లలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. మరోవైపు పరిస్ధితి అదుపు తప్పడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.

Also Read:సీఏఏ అల్లర్లు: నిరసనకారులపై కాల్పులు.. అడ్డొచ్చిన పోలీస్‌కు తుపాకీ గురిపెట్టి

అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పరిస్ధితి ఇంకా అదుపులోకి రాలేదు, గోకుల్ పురి, మౌజ్‌పూర్, బ్రహ్మంపురీ ప్రాంతాల్లో ఇవాళ కూడా నిరసనకారులు రాళ్లు రువ్వుకున్నారు. జఫ్రాబాద్, చాంద్‌బాగ్, మౌజ్‌పూర్‌లో అదనపు బలగాలను మోహరించారు. 35 కంపెనీల పారా మిలటరీ బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. మరోవైపు ఈ హింసపై విచారణ జరపాల్సిందిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జరిగిన నిరసనలు హింసకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లలో ఒక పోలీస్ కానిస్టేబుల్ సహా ఏడుగురు మరణించగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

Also Read:ఢిల్లీలో అల్లర్లు, లూటీలు: 7కు చేరిన మృతుల సంఖ్య, మరోసారి షా భేటీ

గాయపడిన వారిలో డిప్యూటీ పోలీస్ కమీషనర్ అమిత్ శర్మ, ఏసీపీ, ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు సహా 11 మంది పోలీసు సిబ్బంది ఉన్నారని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఆందోళనల సమయంలో పోలీసులపై కాల్పులు జరిపిని ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.