దేశ రాజధాని ఢిల్లీలో సీఏఏ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఆందోళన కార్యక్రమం అదుపు తప్పింది. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారి తీసింది. జఫ్రాబాద్ ప్రాంతంలో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో తీవ్ర హింసాత్మక వాతావరణం చోటు చేసుకుంది.

ఇరు వర్గాల నిరసనలతో రోడ్లపై రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అంతటితో ఆగకుండా జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌ను ముట్టడించారు. దీంతో అధికారులు స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీఛార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. 

Also Read:సీఏఏ నిరసన: 70 రోజుల నిరీక్షణ.. తెరచుకున్న షాహీన్‌బాగ్ రోడ్డు

కాగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాదాపు రెండు నెలలకు పైగా దిగ్బంధానికి గురైన ఢిల్లీలోని షాహీన్‌బాగ్ రహదారి ఎట్టకేలకు తెరచుకుంది. ఢిల్లీలోని జామియా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, హర్యానాలోని ఫరీదాబాద్‌‌లను కలిపే ఈ రహదారిని తెరచినట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా సౌత్ ఈస్ట్ డీసీపీ మాట్లాడుతూ.. 9వ నెంబర్ రహదారిని నిరసనకారులు తాజాగా పున: ప్రారంభించారు. అయితే వీరి నిర్ణయంపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ షాహీన్‌బాగ్‌లో గత 70 రోజులుగా స్థానికులు, పలువురు నిరసనకారులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

Also Read:అమూల్యకు నక్సల్స్ తో లింక్స్: సీఎం యడియూరప్ప వ్యాఖ్యలు

ఈ రహదారిపై నిరసనలు అంతకంతకూ పెరగడంతో ఈ మూడు ప్రధాన రహదారులకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆందోళనల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటుండటంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతియుతంగా నిరసనలు చేసుకోవచ్చునని చెబుతూనే ప్రజలను ఇబ్బందుకు గురిచేయొద్దని సూచించింది.

అలాగే వేదికను మరోచోటకి మార్చుకోవాలని సూచించిన కోర్టు.. సీనియర్ న్యాయవాది సంజయ్‌ను మధ్యవర్తిగా నియమించి నిరసనకారులతో చర్చలు జరపాల్సిందిగా ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయన ఆందోళనకారులతో చర్చలు జరిపారు.