ప్రస్తుత కేరళ గవర్నర్, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో పనిచేసిన అప్పటి కేంద్ర మంత్రి, ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ పౌరసత్వ సవరణ చట్టం, 2019 కు అనుకూలంగా మాట్లాడారు. ఒక న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ ఆయన ఈ మాటలు అన్నారు. 

మహాత్మా గాంధీ, దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పాకిస్తాన్లోని మైనారిటీలకు పౌరసత్వ హక్కుపై వాగ్దానం చేసినట్లు గవర్నర్ ఖాన్ గుర్తుచేశారు. రాజస్థాన్ ప్రస్తుత ముఖ్యమంత్రి  అశోక్ గెహ్లాట్ కూడా గతంలో భారతదేశానికి వచ్చిన శరణార్థులకు హక్కులు కల్పించమని కోరినట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

Also read: అక్కడ అమ్మాయిలు, మహిళలు బయటికి వెళ్తే చాలు...జరిగే ఆకృత్యాలు చెప్పుకోలేనివి...

పౌరసత్వ సవరణ చట్టం, 2019 ను ఒక వర్గం పట్ల వివక్షతగా చిత్రీకరించినందుకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ను నిందించిన గవర్నర్ ఖాన్, దేశ విభజన తరువాత మిగిలిపోయిన ముస్లిమేతరులకు అప్పటి పార్టీ నాయకులు ఇచ్చిన వాగ్దానాన్ని ఈ చట్టం నెరవేరుస్తుందని ఆయన అన్నారు. వారికి ఉపాధి, పౌరసత్వం, సౌకర్యవంతమైన జీవితాన్ని అందించడానికి భారత ప్రభుత్వం నిబద్ధతను ఇది నొక్కి చెబుతుందని ఆయన అన్నాడు. 

1947 జూలై 7 న మహాత్మా గాంధీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గవర్నర్ ఖాన్ ఉటంకించారు. పాకిస్తాన్లోని హిందువులు, సిక్కులు పాకిస్తాన్లో నివసించకూడదనుకుంటే భారతదేశంలో వచ్చి నివసించే హక్కు ఉందని మహాత్మా గాంధీ అప్పట్లో చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు.