ఉత్తరప్రదేశ్‌లో ఖతౌలీ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించే తేదీలను ఈసీ ప్రకటించింది. వచ్చే నెల 5వ తేదీన ఎన్నిక నిర్వహిస్తే 8వ తేదీన ఫలితాలను వెల్లడించనుంది. వచ్చే నెల 8వ తేదీన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెలువడనున్నాయి.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఖతౌలీ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక తేదీలను ఎన్నికల సంఘం ఈ రోజు ప్రకటించింది. వచ్చే నెల 5వ తేదీన ఈ స్థానానికి బైపోల్ నిర్వహిస్తామని వెల్లడించింది. 8వ తేదీన ఫలితాలను వెల్లడించనుంది.
ఈ నెల 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తామని, నామినేషన్లకు చివరి గడువు 17వ తేదీ అని తెలిపింది. కాగా, 21వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించింది. 5వ తేదీన ఉపఎన్నిక నిర్వహిస్తే 8వ తేదీన కౌంటింగ్ ఉంటుంది.
8వ తేదీన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
2013 ముజఫర్ నగర్ అల్లర్లలో బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీ దోషిగా తేలాడు. దీంతో ఆయనపై అనర్హత వేటు పడింది. ఫలితంగా ఖతౌలీ నియోజకవర్గ స్థానం ఖాళీ అయింది. తాజాగా, ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడానికి ఈసీ నిర్ణయించింది.
Also Read: బిహార్‌లో బీజేపీ విజయానికి ఎంఐఎం హెల్ప్! ఆర్జేడీ ఓట్ల చీలికతో కమలం గెలుపు
ఈ ఉపఎన్నికతో దేశంలోని అన్ని అసెంబ్లీలో సంపూర్ణ సీట్లతో ఉన్నట్టు అవుతాయని ఈసీ వెల్లడించింది. ఇటీవలే దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు స్థానాలకు ఎన్నికల సంఘం ఉపఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 3వ తేదీన ఉపఎన్నిక జరిగింది. ఈ ఏడు స్థానాల్లో ఉపఎన్నికలకు ముందు బీజేపీ మూడు స్థానాలు, కాంగ్రెస్ రెండు స్థానాలు, శివసేన, ఆర్జేడీలవి ఒక్కో స్థానం. కానీ, ఇక్కడ భిన్న కారణాల రీత్య ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఉపఎన్నికల ఫలితాలు ఈ రోజు వెల్లడయ్యాయి. ఇందులో బీజేపీ మూడు స్థానాలకు బదులు నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం ఏడు స్థానాల్లో నాలుగు స్థానాలను బీజేపీ గెలుచుకుని ఈ ఉపఎన్నికలో పై చేయి సాధించింది.
ఉత్తరప్రదేశ్‌లో గోలా గోక్రాన్నాథ్, హర్యానాలోని ఆదంపూర్, బిహార్‌లోని గోపాల్‌గంజ్, ఒడిశాలోని ధామ్‌నగర్‌లో బీజేపీ విజయపతాక ఎగరేసింది. కాగా, బిహార్‌లోని మొకామాలో ఆర్జేడీ, తెలంగాణలోని మునుగోడులో టీఆర్ఎస్, మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఈస్ట్ ఆంధేరీలో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన పార్టీలు గెలిచాయి.
నిజానికి ఆర్జేడీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేనలు వాటి స్థానాల్లో తిరిగి గెలుచుకుని సీటును కాపాడుకున్నాయి. కానీ, కాంగ్రెస్ మాత్రం ఈ ఉపఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన రెండు స్థానాలనూ నిలబెట్టుకోలేకపోయింది. కాంగ్రెస్ రెండు స్థానాలనూ కోల్పోయి.. ఈ ఎన్నికల్లో ఎక్కువగా నష్టపోయిన పార్టీగా మిగిలింది. కాగా, ఈ రెండు స్థానాలను మునుగోడులో టీఆర్ఎస్, హర్యానాలో బీజేపీ గెలుచుకుంది.
