Asianet News TeluguAsianet News Telugu

బిహార్‌లో బీజేపీ విజయానికి ఎంఐఎం హెల్ప్! ఆర్జేడీ ఓట్ల చీలికతో కమలం గెలుపు

బిహార్‌లో గోపాల్‌గంజ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ గెలుపునకు ఎంఐఎం, బీఎస్పీ దోహదపడినట్టు తెలుస్తున్నది. ఈ రెండు పార్టీల అభ్యర్థులు ఆర్జేడీ ఓట్లను కొల్లగొట్టడంతో స్వల్ప మార్జిన్‌తో బీజేపీ అభ్యర్థి బయటపడగలిగారు. 
 

AIMIM may have helped to win bjp in bihars gopalganj bypoll
Author
First Published Nov 7, 2022, 12:37 PM IST

న్యూఢిల్లీ: బీజేపీ, ఎంఐఎం భావజాలాలు విరుద్ధమైనవి. బహిరంగంగా ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటారు. కానీ, రాజకీయం చదరంగానికి మించినది. ఎటు మలుపు తిరుగుతుందో సులువుగా ఊహించలేనిది. ఇవి భావజాలాలపరంగా భిన్న స్రవంతులకు చెందినవే అయినా.. పరోక్షంగా బిహార్‌లో ఒకదాని గెలుపునకు మరొక దాని పోటీ దోహదపడినట్టు తెలుస్తున్నది.

బిహార్‌లో రెండు స్థానాలు మొకామా, గోపాల్‌గంజ్‌లో ఉపఎన్నికలు జరిగాయి. మొకామా, గోపాల్‌గంజ్‌లలో వరుసగా ఆర్జేడీ, బీజేపీలు గెలుచుకుని తమ స్థానాలను పదిలం చేసుకున్నాయి. నిజానికి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆర్జేడీ మరింత పుంజుకుని గోపాల్‌గంజ్‌ సీటునూ బీజేపీ నుంచి లాక్కునే స్థాయికి చేరింది. కానీ, ఈ ఎన్నికల బరిలో ఎంఐఎం పోటీకి దిగడంతో ఆర్జేడీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇది బీజేపీకి కలిసి వచ్చింది. ఫలితంగా స్వల్ప మెజార్టీతోనే బీజేపీ తన స్థానాన్ని దక్కించుకోగలిగింది.

Also Read: అక్కడ నోటాకు రెండో స్థానం.. ఇక్కడ కేఏ పాల్‌కు ఓట్లెన్నో తెలుసా?

గోపాల్‌గంజ్‌లో బీజేపీ అభ్యర్థి కుసుమ్ దేవీ పోటీ చేశారు. ఆర్జేడీ అభ్యర్థి మోహన్ ప్రసాద్ గుప్తాపై స్వల్ప మార్జిన్ 1,794 ఓట్లతో కుసుమ్ దేవీ గెలుపొందారు. ఇక్కడ ఆర్జేడీ గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపించాయి. కానీ, ఎంఐఎం పోటీ చేయడం ఆర్జేడీ అవకాశాలకు గండికొట్టింది. ఇక్కడ ఎంఐఎం అబ్దుల్ సలాంను బరిలో దింపింది. అబ్దుల్ సలాం 12,214 ఓట్లను గెలుచుకున్నారు. ఇవి బీజేపీ గెలిచిన మార్జిన్ కంటే ఏడు రెట్లు ఎక్కువ ఓట్లు. కుసుమ్ దేవి 70,053 ఓట్లు, మోహన్ ప్రసాద్ గుప్తా 68,259 ఓట్లు గెలుచుకున్నారు.

ఈ ఫలితాలను చూస్తే ఎంఐఎం గోపాల్‌గంజ్‌లో అభ్యర్థిని బరిలోకి దింపకుంటే బీజేపీ గెలుపు కష్టసాధ్యంగానే కనిపించింది. మరో విధంగా చెప్పాలంటే ఆర్జేడీ సునాయసంగా గెలిచేదని స్థానిక విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: మునుగోడులో ఓడి గెలిచిన బీజేపీ.. పరాజయం పాలైనా ప్లస్సే.. ఎలాగంటే?

ఆర్జేడీ పరాజయానికి మరో కారణం కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ బావమరిది సాధు యాదవ్ భార్య కూడా పోటీ చేయడం దెబ్బతీసింది. సాధు యాదవ్ భార్య ఇందిరా యాదవ్‌ గోపాల్‌గంజ్‌లో బీఎస్పీ టికెట్ పై పోటీ చేసి 8,854 ఓట్లు గెలుచుకున్నారు. ఈ మొత్తం కూడా కుసుమ్ దేవి విన్నింగ్ మెజార్టీకి ఐదు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఎంఐఎం, బీఎస్పీ అభ్యర్థులు ఆర్జేడీ అభ్యర్థిని దెబ్బతీయగా.. బీజేపీ పై చేయి సాధించడానికి పరోక్షంగా దోహదపడ్డట్టు అయింది.

2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ప్రాబల్య ప్రాంతమైన సీమాచంల్ రీజియన్‌లో ఎంఐఎం పోటీ చేసి ఐదు స్థానాలను గెలుచుకుంది. ఇవి ఆర్జేడీ గెలుపును దెబ్బతీసినవే. ఇదే ఏడాది తొలినాళ్లలో అందులో నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు మళ్లీ ఆర్జేడీ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios