దేశంలోని నాలుగు రాష్ట్రాల్లోని పలు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. ఒక‌ ఎంపీ, నాలుగు ఎమ్మెల్యే సీట్ల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల ఫలితాల్లో కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీలు సత్తా చాటగా.. బీజేపీకి నిరాశే ఎదురైంది.  

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు గాను నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని అందుకున్న భారతీయ జనతా పార్టీకి (bjp) ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలు షాకిచ్చాయి. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఒక‌ ఎంపీ, నాలుగు ఎమ్మెల్యే సీట్ల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు శ‌నివారం విడుద‌ల‌య్యాయి. ఈ ఫ‌లితాల్లో బీజేపీకి ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా ద‌క్క‌కపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఉనికి కోసం తాపత్రయపడుతోన్న కాంగ్రెస్ (congress) పార్టీ ఏకంగా మూడు స్థానాల్లో గెలుపొందింది. అలాగే ప‌త్తా లేకుండా పోయింద‌ని భావిస్తున్న ఆర్జేడీ (rjd) కూడా ఓ సీటును ఈ ఎన్నిక‌ల్లో ద‌క్కించుకోవడం విశేషం. 

అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ప‌శ్చిమ బెంగాల్‌లోని (west bengal) అస‌న్ సోల్ లోక్‌స‌భ నియోజవ‌ర్గాన్ని అక్క‌డి అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) చేజిక్కించుకుంది. ఆ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన ప్ర‌ముఖ సినీ న‌టుడు శ్ర‌తుఘ్ను సిన్హా ( Shatrughan Sinha) విజ‌యం సాధించారు. ఇక బెంగాల్‌లోనే బ‌ల్లిగంజ్ అసెంబ్లీకి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో మాజీ కేంద్ర మంత్రి, టీఎంసీ నేత బాబుల్ సుప్రియో (Babul Supriyo ) విజ‌యం సాధించారు. ఈ ఇద్ద‌రు నేత‌లు కూడా బీజేపీకి గుడ్ బై చెప్పి టీఎంసీలో చేరిన వారే .

ఇకపోతే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో (five state elections) పంజాబ్ మినహా ఉత్తరప్రదేశ్ (uttar pradesh), ఉత్తరాఖండ్ (uttarakhand), మణిపూర్ (manipur), గోవాలలో (goa) బీజేపీ మరోసారి అధికారాన్ని అందుకుంది. పంజాబ్‌లో (punjab) మాత్రం ఆప్ ధాటికి చతికిలపడింది. మరి తాజాగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికలకు సంబంధించి పది కీలక పాయింట్లు చూస్తే:

  • బెంగాల్‌లోని బల్లిగంజ్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో టీఎంసీ నేత బాబుల్ సుప్రియో.. తన సమీప ప్రత్యర్ధి సీపీఐ( ఎం) సైరా షా హలీమ్‌పై 20,228 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 
  • బీహార్‌లోని ఆర్‌జేడీ బోచాహన్ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్ధిపై ఆర్జేడీ అభ్యర్ధి అమర్ పాశ్వాన్ 35000 (Amar Paswan) ఓట్ల తేడాతో గెలుపొందారు. 
  • అమర్ తండ్రి ముసాఫిర్ పాశ్వాన్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అమర్ పాశ్వాన్‌కు 82,116 ఓట్లు రాగా.. అతని సమీప బీజేపీ ప్రత్యర్ధి బేబీ కుమారికి 45,353 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో ముసాఫిర్ పాశ్వాన్ ఇక్కడ గెలుపొందారు. 
  • అసన్‌సోల్ లోక్‌సభ స్థానంలో తృణమూల్ అభ్యర్ధి , ప్రముఖ సినీనటి శత్రుఘ్న సిన్హా తన సమీప పోటీదారు.. బీజేపీ అభ్యర్ధి అగ్నిమిత్ర పాల్‌ను 2.97 లక్షల ఓట్ల భారీ తేడాతో ఓడించారు. టీఎంసీలో చేరేందుకు బాబుల్ సుప్రియో బీజేపీని వీడటంతో అసన్‌సోల్ స్థానంలో ఉపఎన్నికలు వచ్చాయి. 
  • మమతా బెనర్జీ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేత అని విజయం తర్వాత శత్రుఘ్న సిన్హా వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల్లో ఆమె గేమ్ ఛేంజర్ అవుతారని సిన్హా జోస్యం చెప్పారు. బీహార్‌తో సహా దేశంలో ఎక్కడైనా తాము మమత వెంటే వుంటామని ఆయన తెలిపారు. 
  • అంతకుముందు మమతా బెనర్జీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అసన్‌సోల్, బల్లిగంజ్‌లలో తమకు మరోసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ.. సీఎం ట్వీట్ చేశారు. 
  • మహారాష్ట్రలోని కొల్హాపూర్ నార్త్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి జయశ్రీ జాదవ్‌కు అధికార మహా వికాస్ అఘాడి మద్ధతు లభించింది. దీంతో ఈ ఎన్నికల్లో ఆమె తన సమీప బీజేపీ అభ్యర్ధి సత్యజిత్ కదమ్‌పై 18,900 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 
  • కొల్హాపూర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం విజయం పట్ల శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్లు, హనుమాన్ చాలీసాలను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేసిందన్నారు. 
  • ఏళ్లుగా తాము హనుమాన్ జయంతిని, శ్రీరామనవమిని ఉత్సాహంతో జరుపుకుంటున్నామని సంజయ్ రౌత్ తెలిపారు. కానీ ఈ సారి శ్రీరామనవమి రోజున మతపరమైన అల్లర్లు జరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలా ఎప్పుడు ఇలా జరగలేదన్నారు. శ్రీరామ నవమి నాడు 10 రాష్ట్రాల్లో అల్లర్లు జరిగాయని.. ఎక్కడ ఎన్నికలు జరిగినా అల్లర్లు సృష్టించి గెలవడమే బీజేపీ వ్యూహమని సంజయ్ రౌత్ ఆరోపించారు.
  • ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ అభ్యర్ధి ఆధిక్యంలో వున్నారు. జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జే) ఎమ్మెల్యే దేవవ్రత్ సింగ్ మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.