Asianet News TeluguAsianet News Telugu

నేడు ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. ఎక్కడెక్కడంటే ?

నేడు దేశ వ్యాప్తంగా ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆరు రాష్ట్రాల్లో జరిగే ఈ ఎన్నికలను దాదాపు అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి. దీంతో గురువారం జరిగే ఈ ఎన్నికల పోరు పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

By elections for seven assembly seats in six states today.. The Election Commission has completed the arrangements
Author
First Published Nov 3, 2022, 12:14 AM IST

ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 1వ తేదీన (గురువారం) ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీని కోసం ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ ఏడు స్థానాల్లో జరిగే ఎన్నికలను ఆయా రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలకు రాజకీయంగా చాలా ప్రాముఖ్యత ఉంది.

బీహార్‌లోని మొకామా, గోపాల్‌గంజ్, హర్యానాలోని అడంపూర్, తెలంగాణాలోని మునుగోడు, ఉత్తరప్రదేశ్‌లోని గోలా, ఒడిశాలోని ధామ్‌నగర్‌, మహారాష్ట్రలోని అంధేరి (తూర్పు) అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు, సీనియర్ నాయకులు తమ పార్టీలకు ఓటు వేయాలని ఎన్నికల ప్రచారం ముగిసే చివరి నిమిషం వరకు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

మరికాసేపట్లో పెళ్లి... పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వధువు..!

మహారాష్ట్ర
మహారాష్ట్రలోని అంధేరి (తూర్పు) నియోజకవర్గంలో  ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన ఎమ్మెల్యే రమేష్ లత్కే మరణించారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. అయితే ఉద్దవ్ ఠాక్రే వర్గం ఆ స్థానం నుంచి ఆయన భార్య రుతుజా లట్కేను పోటీలో ఉంచారు. దీంతో బీజేపీ పోటీ నుంచి వైదొలిగింది. మహారాష్ట్రలో రాజకీయ చీలిక ఏర్పడి ఏక్ నాథ్ షిండే సీఎం అయిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. ఇందులో రుతుజా లట్కే సులభంగా విజయం సాధిస్తారని అందరూ భావిస్తున్నారు. ఇక్కడ నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనుంది.

బీహార్
నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) ఆగస్ట్‌లో బీజేపీతో తెగతెంపులు చేసుకొని మళ్లీ ఆర్జేడీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత బీహార్‌లోని మొకామా, గోపాల్‌గంజ్ స్థానాలకు జరుగుతున్న మొదటి ఉప ఎన్నికలు ఇవి. ఆ స్థానాలు గతంలో ఆర్జేడీ, బీజేపీలు గెలుపొందాయి. మోకామా ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కేసులో దోషిగా తేలడంతో ఈ ఏడాది ప్రారంభంలో ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆర్జేడీను ఆ స్థానం నుంచి ఆయన భార్య నీలం దేవీని పోటీలో దించింది. ఆమెకు ఓటు వేయాలని నితీష్ కుమార్ ఓ వీడియో సందేశంలో ఓటర్లను కోరారు. బీజేపీ లాలన్ సింగ్ భార్య సోనమ్ దేవిని ఆ స్థానం నుంచి పోటీలో నిలిపింది.

గోపాల్‌గంజ్‌ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సుభాష్ సింగ్ చనిపోవడంతో అక్కడి నుంచి అతడి భార్య కుసుమ్ దేవిని బీజేపీ పోటీకి దింపింది. అలాగే ఆర్జేడీ  మోహన్ గుప్తాను రంగంలోకి దించగా, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ బావ అయిన సాధు యాదవ్ భార్య ఇందిరా యాదవ్ పోటీ చేస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్
గోలా గోరఖ్ పూర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న అరవింద్ గిరి సెప్టెంబర్ 6వ తేదీన చనిపోయారు. అప్పటి నుంచి ఆ స్థానం కాళీగా ఉంది. ఇక్కడ బీఎస్పీ, కాంగ్రెస్‌లు ఉప ఎన్నికలకు దూరంగా ఉండడంతో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య ప్రత్యక్ష పోరు కనిపిస్తోంది. బీజేపీ అరవింద్ గిరి కుమారుడు అమన్‌గిరిని, ఎస్పీ అభ్యర్థిగా గోలా మాజీ ఎమ్మెల్యే వినయ్ తివారీ బరిలోకి దిగారు.

భారత్‌పై కన్నేసే గట్స్ ఎవరికీ లేవు: కేంద్ర రక్షణ సహాయ మంత్రి

హర్యానా
హిసార్ జిల్లాలో అడంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ చిన్న కుమారుడు కుల్దీప్ బిష్ణోయ్ తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఇక్కడ ఎన్నికలు అనివార్యం అయ్యాయి. బీజేపీ తరుఫున బిష్ణోయ్ కుమారుడు భవ్య పోటీలో ఉన్నారు. ఈ స్థానం కోసం కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, ఆమ్ ఆద్మీ పార్టీలు రంగంలోకి దిగాయి. మొత్తంగా 22 మంది అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు ఇందులో భజన్ లాల్ మనవడు కూడా ఉన్నారు. 

తెలంగాణ
నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దీనిని ప్రధానంగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. 

మంటల్లో చిక్కుకున్న మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు.. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు.. రెండు రోజుల్లో రెండో ఘటన

ఒడిషా
ధామ్‌నగర్ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న బిష్ణు చరణ్ సేథీ మరణంతో ఇక్కడ ఉప ఎన్నికలు జరగుతున్నాయి. దీంతో బీజేపీ ఆయన కుమారుడు సూర్యబన్షి సూరజ్‌ను పోటీలో దించింది. అధికార బీజేడీ అబంతి దాస్‌ను పోటీలో నిలిపింది. మొత్తంగా ఈ స్థానం కోసం ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios