ఉత్తరప్రదేశ్ లో సోమవారం అర్థరాత్రి ఓ బస్సు బోల్తా పడింది. అడ్డువచ్చిన జంతువును తప్పించే ప్రయత్నంలో బస్సు అదుపుతప్తి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లోని ఎటాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సుకు అడ్డు వచ్చిన జంతువును తప్పించబోయిన డ్రైవర్ కు వాహనం మీద పట్టు తప్పడంతో.. బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక ప్రయాణికుడు మృతి చెందగా, 18 మంది గాయపడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మలవన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్‌చంద్‌పూర్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.
బస్సు కాన్పూర్ నుంచి మీరట్ వెళ్తోందని పోలీసులు తెలిపారు. సోమవారం అర్థరాత్రి బస్సుకు ఎదురుగా వచ్చిన ఓ జంతువును ఢీకొట్టకుండా తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించడంతో ప్రమాదం జరిగిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ ధనంజయ్ కుష్వాహ తెలిపారు. ఘటనలో మృతి చెందిన బాధితుడిని కన్నౌజ్ జిల్లాకు చెందిన జస్వంత్ (45)గా గుర్తించారు. గాయపడిన 18 మందిలో ఐదుగురు మహిళలు ఉన్నారని తెలిపారు.
నిజామాబాద్ లో ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కంటైనర్.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..
ఇదిలా ఉండగా, ఓ పోలీసు తన ముగ్గురు సహచరులపై కాల్పులు జరిపిన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. ఢిల్లీలోని హైదర్పూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర పహారా కాస్తున్న సమయంలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సిక్కిం పోలీస్ కు చెందిన ఇండియన్ రిజల్ట్ బెటాలియన్ విభాగానికి చెందిన 32 ఏళ్ల ప్రబిన్ రాయ్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో కమాండర్ పింటో నంగయాల్ భుటియా, ఇంద్రాలాల్ ఛెత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ధన్ హాంగ్ సుబ్బా అనే పోలీస్ తీవ్ర గాయాల పాలయ్యాడు. అతడిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు వివరించారు.
అయితే ప్లాంట్ దగ్గర పహారా కాస్తున్న సమయంలో వీరిమధ్య ఘర్షణ జరగడమే ఈ కాల్పులకు దారితీసినట్లు ప్రాథమిక సమాచారం. ఈ కాల్పుల ఘటనపై మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తమకు పిసిఆర్ కాల్ వచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి చూడగా ముగ్గురు కిందపడి ఉన్నారని తెలిపారు. వీరిలో ఇద్దరూ అప్పటికే మృతి చెందగా.. ఒకరు తీవ్ర గాయాలతో పడి ఉన్నారు. దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకు వెళ్ళామని.. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు ప్రబీన్ రాయ్ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు అని తెలిపారు.
