కేరళ మాన్‌సూన్ బంపర్ లాటరీ 2023 మొదటి బహుమతిని 11మంది  పారిశుద్ధ్య కార్మికులు దక్కించుకున్నారు. విజేతకు రూ. 10 కోట్లు, రెండవ బహుమతి రూ. 10 లక్షలు,  రూ. 1 లక్ష కన్సోలేషన్ బహుమతి కూడా ఉంది.

మలప్పురం : ఊహించని విధంగా భారీ మొత్తంలో లాటరీ తగిలితే.. వారి భావోద్వేగాలు కలగాపులగంగా ఉంటాయి. దిగ్భ్రాంతి, అవిశ్వాసం, ఉత్సాహం, ఆనందం కలగలిసి ఓ గమ్మత్తైన ఫీలింగ్ కు లోనవుతారు. తమకు నిజంగానే ఇంత అదృష్టం పట్టిందన్నదాన్ని వెంటనే అంగీకరించలేరు. అలాంటి పరిస్థితే ఎదురయ్యింది కేరళలోని మహిళా మున్సిపాలిటీ కార్మికులకు. 

కేరళ, మలప్పురం జిల్లాలోని 11 మంది మహిళా మున్సిపాలిటీ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వ 2023 మాన్‌సూన్ బంపర్ లాటరీలో రూ. 10 కోట్ల జాక్‌పాట్‌ను సంయుక్తంగా గెలుచుకున్నారు. దీనికి వారెంతో సంతోషిస్తున్నారు. వీరంతా హరిత కర్మ సేన, రాష్ట్ర కుటుంబశ్రీ మిషన్ గ్రీన్ ఆర్మీ సభ్యులు.. రోజూ చెత్తను ఇంటి గుమ్మాల నుండి సేకరిస్తారు. దాన్ని ప్రాసెసింగ్‌కు ముందు క్రమబద్ధీకరించే పనిలో ఉన్నారు.

వివాహితను తుపాకీతో కాల్చి హత్య.. నిందితుడిని గుర్తించి పోలీసులు ఇంటికి రాగానే ఆత్మహత్య

విజేతలు మలప్పురం జిల్లాలోని పరప్పనంగడి మునిసిపాలిటీకి చెందినవారు. వీరికి స్వయంగా టికెట్లు కొనే స్తోమత లేకపోవడంతో.. 11మంది కలిసి రూ.250ల టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. డ్రాలో BR-92 టిక్కెట్ MB200261ను అదృష్టం వరించింది. ఆదాయపు పన్ను, ఏజెంట్ కమీషన్ మినహాయించిన తర్వాత, లాటరీ డబ్బు మొత్తం విజేతల్లోని ఒకరి ఖాతాలో జమ చేస్తారు. విజేత టికెట్‌ను పరప్పనంగడిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖకు అందజేశారు.

తమకు పదికోట్ల లాటరీ తగలడం వారు నమ్మలేకపోతున్నారు. ఈ మొత్తంతో తమ అప్పులు తీర్చుకుని, ఇండ్లు కట్టుకోవడం, రిపేర్లు చేయించుకోవాలనేవ వారికోరికలు. కలలో మాత్రమే సాధ్యమనుకున్నది నిజమవుతూ వారు లక్షాధికారులగా మారిపోయారు. 

"ఊహించని విధంగా మేము జాక్‌పాట్‌ను కొట్టామని తెలిసి నేను చాలా సంతోషించాను" అని మహిళల్లో ఒకరు చెప్పారు. మాన్‌సూన్ బంపర్ టిక్కెట్‌ను కొనుగోలు చేసిన రాధా అనే మహిళ మాట్లాడుతూ.. గతంలో ఒకసారి రూ. 1000 టిక్కెట్‌ను గెలుచుకున్నానని తెలిపింది. ఈ డబ్బుతో "ఇంటిని బాగుచేయించుకోవాలని" సమాధానం చెప్పింది. కొన్ని అప్పులు కూడా తీర్చాలని తెలిపింది. 

"మాకందరికీ చాలా బాధ్యతలు ఉన్నాయి. ఆదాయం తక్కువ.. అవసరాలు ఎక్కువ.. ఈ లాటరీ ద్వారా గెలిచిన డబ్బుతో, నాకున్న రూ. 3 లక్షల అప్పును తీర్చాలని చూస్తున్నాను’ అని మరో మహిళ తెలిపింది. 

57 మంది సభ్యులతో కూడిన హరిత కర్మ సేన సమన్వయకర్త షీజా గణేష్ విజేతలకు తన అభినందనలు తెలిపారు. వారు కష్టపడి పని చేసే వ్యక్తులు అని ఆమె చెప్పారు. ఇతర సభ్యులు చెత్తను క్రమబద్ధీకరించడంలో, తూకం వేయడంలో బిజీగా ఉండగా, ముగ్గురు సభ్యులు ఇంటింటికీ వెళ్లి ఇంటి నుండి చెత్తను సేకరిస్తున్నారు. వారి నెలవారీ ఆదాయం రూ. 8000 నుంచి రూ. 14000 మధ్య ఉంటుంది.

మాన్‌సూన్ బంపర్ రెండవ బహుమతి రూ. 10 లక్షలు, రూ. 1 లక్ష కన్సోలేషన్ బహుమతి కూడా ఉంది. 1967లో కేరళ ప్రభుత్వంచే స్థాపించబడిన కేరళ రాష్ట్ర లాటరీల విభాగం, లాటరీ వ్యవస్థను నిర్వహించే బాధ్యతను చూస్తుంది. వారానికోసారి లాటరీలు నిర్వహించడం భారతదేశంలోనే తొలిసారి. ప్రస్తుతం, డిపార్ట్‌మెంట్ ఏడు లాటరీలను నిర్వహిస్తోంది, తిరువనంతపురంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 3:00 గంటలకు డ్రాలు జరుగుతాయి.