ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహార్‌‌లో గోసంరక్షకుల చేతిలో హత్యకు గురైన ఇన్‌స్పెక్టర్ సుబోధ్ సింగ్ కుటుంబసభ్యులు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని కలిశారు. గోవధ విషయంలో అల్లర్లు రేగడం.. ఘర్షణను అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీస్ అధికారిని గోసంరక్షకులు హతమార్చడం తెలిసిందే.

దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి యోగి గోవధ గురించే మాట్లాడారని.. సుబోధ్ హత్య గురించి ప్రస్తావించలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు సంధించాయి. దీనిపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో సీఎం మౌనం వీడారు.

ఇవాళ ఉదయం ఇన్‌స్పెక్టర్ సుబోధ్ భార్య, ఇద్దరు కుమారులు, సోదరి లక్నోలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో యోగి ఆదిత్యనాథ్‌ని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం సుబోధ్ కుటుంబానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.

సిట్ నివేదిక అందించిన వెంటనే వివరాలు అందిస్తామని ఆయన తెలిపారు. మరోవైపు సుబోధ్ కుటుంబానికి రూ.40 లక్షల నష్టపరిహారాన్ని గతంలోనే సీఎం ప్రకటించారు. కాగా సుబోధ్ జ్ఞాపకార్థం ఏటా పట్టణం నుంచి సుబోధ్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారికి సుబోధ్ సింగ్ పేరు పెడతామని మంత్రి అతుల్ గార్గ్ ప్రకటించారు.

బులంద్‌షహర్‌ జిల్లాలోని మహవ్ ప్రాంతంలో ఒక మతానికి చెందిన కొందరు వ్యక్తులు గోవును చంపారని పోలీసులకు సమాచారం అందింది.. వారు ఘటనాస్థలికి వచ్చే లోపు... గ్రామంలో అల్లర్లు చోటుచేసుకుని ఉద్రిక్తతకు దారి తీసింది.

ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు.. పోలీసులపైకి రాళ్లు రువ్వారు, వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. కొందరు నిరసనకారులు కూడా కాల్పులు జరపడంతో.. ఇన్‌‌స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు.

బులంద్‌షహర్‌లో ఇన్‌‌స్పెక్టర్ హత్య... ఐదుగురి అరెస్ట్

ఉత్తర ప్రదేశ్ లో చెలరేగిన హింస...నిరసనకారుల దాడిలో ఎస్సై మృతి (వీడియో)