ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో అల్లర్లను అదుపు చేయడానికి ప్రయత్నించిన ఇన్‌‌స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్‌ను ఆందోళనకారులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 5గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గోవధపై ఫిర్యాదు చేసిన వ్యక్తే ఇన్స్‌పెక్టర్‌ను చంపిన ఘటనలో ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. అల్లర్లకు పాల్పడిన బజరంగ్‌దళ్, వీహెచ్‌పీ, బీజేపీకి చెందిన 27 మంది కార్యకర్తలను, 60 మంది గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బులంద్‌షహర్‌ జిల్లాలోని మహవ్ ప్రాంతంలో ఒక మతానికి చెందిన కొందరు వ్యక్తులు గోవును చంపారని పోలీసులకు సమాచారం అందింది.. వారు ఘటనాస్థలికి వచ్చే లోపు... గ్రామంలో అల్లర్లు చోటుచేసుకుని ఉద్రిక్తతకు దారి తీసింది.

ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు.. పోలీసులపైకి రాళ్లు రువ్వారు, వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు.

కొందరు నిరసనకారులు కూడా కాల్పులు జరపడంతో.. ఇన్‌‌స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. మరోవైపు బులంద్‌షహర్ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అల్లర్లపై విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆందోళనకారుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఇన్‌స్పెక్టర్ సుబోధ్ కుటుంబానికి రూ.40 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అలాగే మరో మరణించిన మరో యువకుడి కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారంతో పాటు కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇస్తామని సీఎం వెల్లడించారు. 

ఉత్తర ప్రదేశ్ లో చెలరేగిన హింస...నిరసనకారుల దాడిలో ఎస్సై మృతి (వీడియో)