న్యూఢిల్లీ: బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేసినట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు.

శనివారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌‌‌పై శనివారం నాడు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

అన్ని రంగాలకు బడ్జెట్‌లో న్యాయం చేసినట్టుగా చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయని మోడీ ప్రకటించారు. ఈ బడ్జెట్‌ దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టే అవకాశం ఉందన్నారు.

Also read:ఇబ్బందిపెట్టిన షుగర్: మధ్యలోనే ముగించిన నిర్మల, అయినా రికార్డు

ఎగుమతులు పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇచ్చినట్టుగా  మోడీ ప్రకటించారు.  రైతుల ఆదాయం మరింత రెట్టింపు కానుందన్నారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం మరింత సులభం కానుందని ప్రధాని చెప్పారు.  పన్నుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 లక్ష గ్రామ పంచాయితీల్లో అంగన్ వాడీ, స్కూళ్లు, వెల్‌నెస్ సెంటర్లకు బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీని ఇస్తున్నట్టుగా మోడీ ప్రకటించారు.  కంపెనీలకు డివిడెండ్ ట్యాక్స్ నుండి మినహాయింపు ఇచ్చినట్టుగా మోడీ గుర్తు చేశారు. దీంతో పెట్టుబడులు పెరుగుతాయని ప్రధాని అభిప్రాయపడ్డారు.