Union budget 2022: సోమవారం నుంచి కేంద్ర బడ్జెట్ రెండో విడుత సమావేశాలు.. కాంగ్రెస్ కీలక భేటీ !
Union budget 2022: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 19 సెషన్లలో ఏప్రిల్ 8 దాకా సమావేశాలు కొనసాగుతాయని సంబంధిత అధికారులు తెలిపారు.
Union budget 2022: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సమావేశం మొదటి భాగం ఫిబ్రవరి 11 వరకు కొనసాగింది. ఇక మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు బడ్జెట్ సెషన్ 2వ సెషన్ నిర్వహించాలని నిర్ణయించారు. దీని ప్రకారం పార్లమెంట్ రేపు సమావేశమవుతుంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 19 సెషన్లలో ఏప్రిల్ 8 దాకా సమావేశాలు కొనసాగుతాయని సంబంధిత అధికారులు తెలిపారు.
5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఉత్కంఠ భరితమైన రాజకీయ పరిస్థితుల మధ్య రేపటి పార్లమెంట్ బడ్జెట్ రెండో విడుత సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు బీజేపీ సభ్యులు ఆసక్తిగా ఉన్నారు. అయితే బడ్జెట్ సమావేశాల్లో పలు అంశాలను లేవనెత్తాలని విపక్షాలు నిర్ణయించాయి. ప్రభుత్వ ఆస్తులను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపక్షాలన్నీ ఏకమై తమ వ్యతిరేకతను చాటుకున్నాయి. కొన్ని చట్టపరమైన ముసాయిదాలపై కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో పార్లమెంట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విపక్షాల యోచనను తిప్పికొట్టి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు బీజేపీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు.
ఇదిలావుండగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాభవాన్ని ఎదుర్కొంది. సోమవారం బడ్జెట్ రెండో విడుత సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే నాయకత్వ మార్పు నివేదికల మధ్య బడ్జెట్ సమావేశాల ప్రణాళికలపై చర్చించడానికి కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల కోసం వ్యూహరచన చేయడం కోసమే పార్టీ-నాయకత్వం అత్యున్నత స్థాయి సమావేశం ఉద్దేశమని కాంగ్రెస్ సీనియర్ నేత కె.సురేష్ ఆదివారం నాడు మీడియాతో అన్నారు.
ఇటీవల జరిగిన ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరమైన పనితీరు కనబర్చిన తర్వాత, నాయకత్వ మార్పులపై చర్చించేందుకు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశం కానున్నారనే వార్తల నేపథ్యంలో సురేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. "రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తే అంశాలపై మేము చర్చ నిర్వహించాము. ఉక్రెయిన్ నుండి తిరిగి వస్తున్న రైతులు మరియు వైద్య విద్యార్థులకు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, MSP సమస్యలను లేవనెత్తడానికి ప్రయత్నిస్తాము" అని రాజ్యసభ సభాపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. పార్టీ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశానికి కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, ఆనంద్ శర్మ, కె. సురేష్, జైరాం రమేష్‌లు ఇప్పటికే 10, జనపథ్ వద్దకు చేరుకున్నారు.