Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని: చెప్పుల దండలు వేసి.. గాడిదపై ఊరేగించారు

గడిచిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో టికెట్ల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు బీఎస్పీ నేతలకు చెప్పుల దండలు వేసి గాడిదపై ఊరేగించారు కార్యకర్తలు

BSP Leaders Garlanded With Shoes, Paraded On Donkey By Party Activits In Rajasthan
Author
Jaipur, First Published Oct 22, 2019, 6:08 PM IST

గడిచిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో టికెట్ల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు బీఎస్పీ నేతలకు చెప్పుల దండలు వేసి గాడిదపై ఊరేగించారు కార్యకర్తలు.

వివరాల్లోకి వెళితే... పార్టీ జాతీయ సమన్వయకర్తగా పనిచేస్తున్న రాజస్థాన్‌కు చెందిన రామ్‌జీ గౌతమ్, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా పనిచేసిన సీతారామ్‌లు టిక్కెట్లను అమ్ముకున్నారని, దానితో పాటు నిజమైన కార్యకర్తలకు కాకుండా కాంగ్రెస్, బీజేపీ లు చెప్పిన వారికి టికెట్లు కేటాయించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి.

వీరిద్దరి వైఖరి పట్ల బీఎస్పీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంగళవారం జైపూర్‌ బనీపార్క్‌లో ఉన్న పార్టీ ఆఫీసులో వీరిద్దరిని వందలమంది కార్యకర్తలు అడ్డుకున్నారు.

ఇద్దరికి ముఖాలకు నల్లరంగు పూసి, మెడలో చెప్పుల దండలు వేశారు. అప్పటికీ కసి తీరకపోవడంతో రామ్‌జీ గౌతమ్‌ను గాడిదపై ఎక్కించి ఊరేగించారు. ఈ ఘటనను పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్ అయ్యింది.

Also Read:కాంగ్రెస్‌లో చేరిన బీఎస్పీ ఎమ్మెల్యేలు: అది విశ్వాసఘాతక పార్టీ అన్న మాయావతి

దీనిపై స్పందించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి కార్యకర్తల తీరును ఖండించారు. దీనిని సిగ్గుపడే చర్యగా అభివర్ణించిన ఆమె ఈ ఘటనపై కాంగ్రెస్‌ను నిందించారు. మొదట తమ పార్టీ నుంచి నాయకులను ఆకర్షించి.. ఇప్పుడు బీఎస్పీ నాయకులపై దాడులు నిర్వహిస్తోందని మాయావతి ట్వీట్ చేశారు.

కొద్దిరోజుల క్రితం  బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాజేంద్ర గుడ్, జోగేంద్ర సింగ్ అవానా, వాజిబ్ అలీ, లఖానా సింగ్ మీనా, సందీయ్ యాదవ్, దీప్‌చంద్ ఖేరియా సోమవారం అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీని కలిసి కాంగ్రస్‌లో చేరాలన్న తమ నిర్ణయాన్ని తెలిపారు.

అభివృద్ధి కోసం ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మద్ధతు తెలుపుతూనే మరోవైపు ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం ఇబ్బందికరంగా మారిందన్నారు.

ఎమ్మెల్యేల చర్యపై బీఎస్సీ అధినేత్రి మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి విశ్వాసఘాతక పార్టీ అనిపించుకుందని ఫైరయ్యారు. అధికారాన్ని అందుకునే క్రమంలో బేషరతుగా మద్ధతు తెలిపినా.. కాంగ్రెస్ తమను మోసం చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: యుపిలో మాయావతికి ఆయన చెక్ పెడుతారా? (వీడియో)

ప్రత్యర్థి పార్టీలపై గెలిచేందుకు సమర్థంగా పనిచేయడానికి బదులు.. మద్ధతిస్తున్న వారికి హానీ కలిగించడం పైనే కాంగ్రెస్ దృష్టి సారించిందన్నారు. దళిత, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ సముఖంగా లేదని ఈ చర్యతో నిరూపితమైందని మాయావతి ధ్వజమెత్తారు.

కాగా.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 స్థానాలు, బీఎస్పీ ఆరు స్థానాల్లో గెలిచింది. 12 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు బీఎస్పీ మద్ధతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios