మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీకి రాజస్థాన్‌లోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాకిచ్చారు. బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సోమవారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

రాజేంద్ర గుడ్, జోగేంద్ర సింగ్ అవానా, వాజిబ్ అలీ, లఖానా సింగ్ మీనా, సందీయ్ యాదవ్, దీప్‌చంద్ ఖేరియా సోమవారం అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీని కలిసి కాంగ్రస్‌లో చేరాలన్న తమ నిర్ణయాన్ని తెలిపారు.

అభివృద్ధి కోసం ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మద్ధతు తెలుపుతూనే మరోవైపు ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం ఇబ్బందికరంగా మారిందన్నారు.

ఎమ్మెల్యేల చర్యపై బీఎస్సీ అధినేత్రి మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి విశ్వాసఘాతక పార్టీ అనిపించుకుందని ఫైరయ్యారు. అధికారాన్ని అందుకునే క్రమంలో బేషరతుగా మద్ధతు తెలిపినా.. కాంగ్రెస్ తమను మోసం చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యర్థి పార్టీలపై గెలిచేందుకు సమర్థంగా పనిచేయడానికి బదులు.. మద్ధతిస్తున్న వారికి హానీ కలిగించడం పైనే కాంగ్రెస్ దృష్టి సారించిందన్నారు. దళిత, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ సముఖంగా లేదని ఈ చర్యతో నిరూపితమైందని మాయావతి ధ్వజమెత్తారు.

కాగా.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 స్థానాలు, బీఎస్పీ ఆరు స్థానాల్లో గెలిచింది. 12 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు బీఎస్పీ మద్ధతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.