కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యెడియూరప్ప హెలికాప్టర్ ల్యాండింగ్ సమస్యాత్మకంగా మారింది. కాలబురగిలో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో అక్కడ ప్లాస్టిక్ షీట్లు, ఇతర చెత్త అంతా గాల్లోకి లేవడంతో పైలట్ దృష్టి అస్పష్టంగా మారింది. దీంతో ల్యాండింగ్‌ను రద్దు చేసుకుని మళ్లీ గాల్లోకి లేపాడు. 

బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ లీడర్ బీఎస్ యెడియూరప్ప ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్‌లో సమస్య ఎదుర్కొంది. దీంతో చివరి నిమిషంలో ఆ హెలికాప్టర్ ల్యాండింగ్ నిర్ణయాన్ని పైలట్ రద్దు చేసుకున్నారు. మళ్లీ హెలికాప్టర్‌ను గాల్లోకే ఎగిరించాడు. ఈ ఘటన కర్ణాటకలోని కాలబురగిలోని జెవర్గి వద్ద జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

బీఎస్ యెడియూరప్ప సోమవారం కాలబురగికి వెళ్లారు. హెలికాప్టర్‌లో వెళ్లిన ఆయన జెవర్గిలో ల్యాండ్ కావాల్సి ఉన్నది. కానీ, ల్యాండ్ కావాల్సిన ప్రాంతంలో ప్లాస్టిక్ షీట్లు, ఇతర చెత్త పడి ఉన్నది. హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం కిందికి దిగుతుండగా.. దాని వేగమైన గాలి వల్ల ఆ ఏరియాలో ఉన్న షీట్లు, కవర్లు అన్ని గాల్లోకి లేచాయి. దుమ్మూ ధూళి అన్ని కలిసి పైలట్‌కు అక్కడ ఏమీ సరిగా కనిపించకుండా చేశాయి. దీనితో ఆ పైలట్ హెలికాప్టర్‌ను మళ్లీ గాల్లోకి లేపాడు. 

అనంతరం, అక్కడ ఉన్న పోలీసులు ఏరియాను క్లియర్ చేశారు. గ్రౌండ్‌లో ప్లాస్టిక్ షీట్లు లేకుండా నీట్‌గా క్లియర్ చేయడంతో హెలికాప్టర్ సేఫ్‌గా ల్యాండ్ అయింది. 

Scroll to load tweet…

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి బీజేపీ సీఎంలను మార్చే వ్యూహాన్ని అమలు చేస్తున్నది. కర్ణాటకలోనూ బీజేపీ.. బీఎస్ యెడియూరప్పను సీఎం పోస్టు నుంచి తొలగించింది. ఆ బాధ్యతలను బసవరాజు బొమ్మైకి అప్పజెప్పింది. 

Also Read: ఆ శాంపిల్స్‌తో వాస్తవ రిపోర్టు రాదు.. మా కూతురిది హత్యే.. నిందితులను శిక్షించాలి:డీజీపీని కలిసిన ప్రీతి తండ్రి

బీజేపీ వ్యూహం ప్రకారం, కొత్త సీఎం సారథ్యంలో ఎన్నికలను గెలవాలి. కానీ, కర్ణాటకలో బీజేపీ మళ్లీ మోస్ట్ సీనియర్ లీడర్ బీఎస్ యెడియూరప్ప పైనే ఆధారపడినట్టుగా తెలుస్తున్నది. అందుకే ఆయనకే ప్రయారిటీ ఇస్తూ ఎన్నికల్లో కీలకంగా వినియోగించుకుంటున్నది. 

కాగా, బీజేపీ అధిష్టానం.. అర్ధాంతరంగా సీఎం పోస్టు నుంచి తొలగించిన బీఎస్ యెడియూరప్పను, ఆ పార్టీని ప్రజలు నమ్ముతారా? అంటూ కాంగ్రెస్ కౌంటర్లు ఇస్తున్నది. త్వరలోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే రాష్ట్రంలో పార్టీలు ఒకదానిపై మరొకటి వేడి వేడిగా వాగ్బాణాలు విసురుకుంటున్నాయి.