ఆ శాంపిల్స్‌తో వాస్తవ రిపోర్టు రాదు.. మా కూతురిది హత్యే.. నిందితులను శిక్షించాలి: ప్రీతి తండ్రి

కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థి ప్రీతి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె తండ్రి నరేందర్ డిమాండ్ చేశారు.

medical student preethi family meets dgp anjani kumar and demands punishment for accused

కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థి ప్రీతి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె తండ్రి నరేందర్ డిమాండ్ చేశారు. ప్రీతి మృతికి సంబంధించి హైదరాబాద్‌లో డీజీపీ అంజనీకుమార్‌ను ఆమె కుటుంబ సభ్యులు ఈరోజు కలిసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా  ప్రీతి తండ్రి మాట్లాడుతూ..నిందితులకు తగిన శిక్ష పడేలా చూడాలని డీజీపీని కోరనున్నట్టుగా చెప్పారు.టాక్సికాలజీ రిపోర్టు తమకు ఇవ్వలేదని చెప్పారు. బ్లడ్ ఎక్కించిన తర్వాత తీసుకున్న శాంపిల్స్‌ను టాక్సికాలజీ కోసం పంపారని ఆరోపించారు. అప్పటికే డయాలసిస్ కూడా పూరైందని అన్నారు. బ్లడ్ కూడా బాడీ నుంచి సేకరించినది  కాదని చెప్పారు. అలాంటి నమునాలతో వాస్తవ రిపోర్టు రాదని వైద్యులు చెబుతున్నారని అన్నారు ఘటన జరిగిన రోజే ఎంజీఎంలో నమూనాలు తీసుకొని ఉంటే టాక్సికాలజీ రిపోర్ట్ సరైన ఫలితం తేలేదని అన్నారు.

ఇక, ప్రీతిది హత్యా?, ఆత్మహత్యా? అని పోలీసులు నిర్దారణకు రాలేకపోతున్నారని.. దీంతో ఈ కేసు వారికి సవాలుగా మారినట్టుగా తెలుస్తోంది. ప్రీతి మత్తు ఇంజక్షన్ తీసుకుందనే ప్రచారం జరగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రీతి శరీరంలో ఏమైనా విష రసాయనాలు ఉన్నాయో తెలుసుకునేందుకు ఆమె నమునాలను సేకరించి టాక్సికాలజీ పరీక్షకు పంపారు. తాజాగా ఇందుకు సంబంధించిన నివేదిక పోలీసుల వద్దకు చేరింది. 

అయితే ప్రీతి నుంచి సేకరించిన నమునాల విశ్లేషణ ఆధారంగా ఆమె బాడీలో ఎలాంటి విషపదార్థాలు లేనట్టుగా రిపోర్టులో వెల్లడైనట్టుగా తెలుస్తోంది. ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని ఆ రిపోర్టులో నిపుణులు పేర్కొన్నట్టుగా సమాచారం. దీంతో గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లోనూ ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్ట్‌తో స్పష్టమైంది. 

ఈ నేపథ్యంలో ప్రీతి కేసు పోలీసులకు సవాలుగా మారింది. మరోవైపు ప్రీతి ఆత్మహత్యా కాదని..  హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు, విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసును పోలీసులు అనుమానాస్పద మృతిగా మార్చే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక గురించి కూడా పోలీసులు వేచిచూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు వరంగల్ సీపీ రంగనాథ్ ఈ కేసు గురించి డీజీపీతో చర్చించేందుకు హైదరాబాద్‌ రానున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రీతి కేసు ఏ మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios