కర్ణాటకలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుంది. జేడీఎస్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్న బీఆర్ఎస్ రాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చేయనుంది. అక్కడ 40 సీట్లలో తన ప్రభావాన్ని వేయనుంది. ఈ 40 నియోజకవర్గాల్లో తెలుగు ఓటు షేర్ గణనీయంగా ఉండటంతో బీఆర్ఎస్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధం అవుతున్నది.
బెంగళూరు: తెలంగాణ బయటా విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తన ముద్ర వేయడానికి సిద్ధం అవుతున్నది. కర్ణాటకలో తెలుగు ఓటర్లను ఆధారం చేసుకున్న ఉనికి చాటాలని ప్రయత్నిస్తున్నది. కర్ణాటకలోని 12 జిల్లాల్లో సుమారు 40 అసెంబ్లీ స్థానాల్లో తెలుగు ఓటర్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 13వ తేదీన విడుదల కానుంది. ఆ తర్వాత ఈ 40 స్థానాల్లో బీఆర్ఎస్ విస్తృత ప్రచారం చేయనుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈ స్థానాల్లో జేడీఎస్ కోసం ప్రచారం చేయనుంది.
బల్లారి, కోలార్, బెంగళూరు రూరల్, బెంగళూరు అర్బన్, రాయ్‌చూర్, కొప్పల, తుమకూరు, చిత్రదుర్గ, చిక్కబల్లాపురా, యాదగిరి, బీదర్, కాలబురగి జిల్లాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చిన తెలుగు ఓటర్లు అధికంగా ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఓటర్ల సంఖ్యకు మించి వీరి ఓటర్ల సంఖ్య ఉన్నది.
సాధారణంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను లింగాయత్‌లు, వొక్కలిగ, అహింద, ఎస్సీ, ఎస్టీలు ప్రభావితం చేస్తుంటారు. ఇప్పుడు 12 జిల్లాల్లోని సీట్లలో తెలుగు ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
బరిలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పోటాపోటీగా నిలబడుతున్నాయి. పోటీ తీవ్రంగా ఉండటంతో గెలుపోటములు మధ్య ఓట్ల తేడా స్వల్పంగా ఉంటున్నది. చాలా సీట్లల్లో గెలుపు మార్జిన్ 5000 ఓట్లకు తక్కువగా ఉంటున్నది. ఇలా చూసుకున్నా తెలుగు ఓటర్లు నిర్ణయాత్మకం కాబోతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 52 సీట్లలో విన్నింగ్ మార్జిన్ 5,000లకు లోపే ఉండటం గమనార్హం. ఈ సారి కూడా సుమారు 50 స్థానాల్లో ఈ మార్జిన్ 5000 లోపు ఉంటుందని భావిస్తుననారు.
Also Read: మల విసర్జన చేస్తుండగా పాము పొట్టలోకి వెళ్లిందని హాస్పిటల్‌కు పరుగు.. వైద్యులు ఏమన్నారంటే?
బీఆర్ఎస్ నేతలు సేకరించిన సమాచారం ప్రకారం, కోలార్ జిల్లాల్లో 76 శాతం ఓటర్లు తెలుగు ప్రజలే. వీరు ఈ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల ఎన్నికలను బలంగా ప్రభావితం చేయనున్నారు. బెంగళూరు రూరల్‌లో 65 శాతం ఓటర్లు తెలుగువారే. వీరు నాలుగు సీట్ల ఎన్నికలను ప్రభావితం చేయగలరు. కాగా, బెంగళూరు అర్బన్ జిల్లాలో 49 శాతం తెలుగు ఓట్లు ఉన్నాయి. వీరు 28 నియోజకవర్గాల్లో ఎన్నికల్లో ప్రభావితం చేయగలరు.
రాయ్‌చూర్ జిల్లాలో 64 శాతం ఓటర్లు ఏడు సీట్లను ప్రభావితం చేయనున్నారు. బల్లారి జిల్లాలో 63 శాతం తెలుగు ఓట్లతో తొమ్మిది సీట్లలో, చిక్కబల్లాపుర జిల్లాలో 49 శాతం ఓటు షేర్‌తో ఐదు నియోజకవర్గాల్లో, కొప్పల్ జిల్లాలో 43 శాతం ఓటు షేర్‌తో ఐదు స్థానాలలో కీలక పాత్ర పోషించనున్నారు.
