KTR: 'ఆ పరిస్థితి ఉహించుకుంటేనే వణుకుపుడుతోంది' : బీజేపీ ఎంపీ ప్రవర్తనపై మంత్రి కేటీఆర్ ఫైర్
KTR : లోక్‌సభలో బీజేపీ ఎంపీ ప్రవర్తనను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. లోక్‌సభలోనే ఇలా అసభ్యంగా,దారుణంగా ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఎట్లా ఉంటుందో ఉహించుకుంటేనే వణుకుపుడుతున్నదని అన్నారు.
KTR : లోక్‌సభ వేదికగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా పోస్టు చేస్తూ.. 'బిజెపి ఎంపి ఇలాంటి అసభ్యకరంగా, దారుణంగా ప్రవర్తించడం సిగ్గుచేటు. అంతకంటే దిగ్భ్రాంతికరం, అవమానకరమైన విషయం ఏమిటంటే.. స్పీకర్ లోక్‌సభలో ఈ అసంబద్ధతను అనుమతించడం. పార్లమెంటులోనే ఇలా జరిగితే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే వణుకు పుడుతుంది. బీజేపీ ఎంపీపై అనుచిత వ్యాఖ్యలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.'అని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను మంత్రి కేటీఆర్ కోరారు.
ఈ ఘటనను ఎమ్మెల్సీ కవిత కూడా తీవ్రంగా ఖండించారు. ట్వీట్ చేస్తూ.. 'మన దేశం అత్యున్నత సభలో ఎంపీ డానిష్ అలీ జీ పట్ల ఎంపీ రమేష్ బిధూరి అమర్యాదకరమైన వ్యాఖ్యలు వినడం చాలా బాధాకరం, దిగ్భ్రాంతికరం. మన ప్రజాస్వామ్య ప్రసంగంలో అలాంటి ప్రవర్తనకు చోటు లేదు. గౌరవ స్పీకర్ ఓం బిర్లా జీ.. తక్షణమే బీజేపీ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను.'అని పేర్కొన్నారు.
అసలేం జరిగింది?
చంద్రయాన్-3 విజయం, భారత అంతరిక్ష కార్యక్రమ విజయాలపై అర్థరాత్రి చర్చ సందర్భంగా గురువారం లోక్‌సభలో బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి.. బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని అనుచిత పదజాలంతో దూషించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో బీజేపీ నాయకత్వం ఎంపీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. స్పీకర్ ఓం బిర్లా కూడా రమేష్ బిధూరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను 'సీరియస్ నోట్'గా తీసుకున్నారు . భవిష్యత్తులో ఇటువంటి ప్రవర్తన పునరావృతమైతే.. ప్రతిపక్ష నాయకులు అతనిని సస్పెండ్ చేయాలని, బీజేపీ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.