#HarGharTiranga అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుకు దేశ ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. దీనిలో భాగంగా కరడుగట్టిన ఉగ్రవాది జావిద్ మట్టూ సోదరుడు రయీస్ మట్టూ ఉత్తర కాశ్మీర్‌లోని సోపోర్‌లోని తన ఇంటిలో ఆదివారం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'అమృత్ మహోత్సవ్ ఆఫ్ ఇండిపెండెన్స్'తో దేశం సంబరాలు చేసుకుంటోంది. భారత స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో 'హర్ ఘర్ తిరంగా' ప్రచార స్ఫూర్తితో ప్రజలు తమ సోషల్ మీడియా ఖాతాల్లోని డీపీల‌ను త్రివర్ణ పతాకంగా మార్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు జరిగే 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పీఎం పిలుపునిచ్చారు. 

అలాగే, "#HarGharTiranga ఉద్యమ స్ఫూర్తితో, మన సోషల్ మీడియా ఖాతాల డీపీని మారుద్దాం. మన ప్రియమైన దేశం, మన మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే ఈ ప్రత్యేక ప్రయత్నానికి మద్దతు ఇద్దాం" అని ప్ర‌ధాని మోడీ ట్విట్ట‌ర్ వేదిక‌గా పిలుపునిచ్చారు. అలాగే, త్రివర్ణ పతాకంతో ఉన్న తమ ఫోటోలను www.harghartiranga.com లో అప్ లోడ్ చేయాలని ఆయన ప్రజలను కోరారు.

ప్రధాని పిలుపుకు దేశ ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే కోట్లాది మంది ప్రజలు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సెల్ఫీ దిగి దానిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కరడుగట్టిన ఉగ్రవాది జావిద్ మట్టూ సోదరుడు రయీస్ మట్టూ ఉత్తర కాశ్మీర్‌లోని సోపోర్‌లోని తన ఇంటిలో ఆదివారం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. భద్రతా సంస్థల ప్రకారం జావిద్ మట్టూ .. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలో కీలక సభ్యుడు. ప్రస్తుతం జావిద్ పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్నాడు. గడిచిన 11 ఏళ్లుగా జావిద్ పాక్‌లోని ఉగ్ర కార్యకలాపాల్లో చురుగ్గా వున్నాడని నివేదికలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రయీస్ మట్టూ దేశభక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Scroll to load tweet…

కాగా.. టైమ్స్ నౌ ప్రచురించిన వీడియోలో రయీస్ మట్టూ తన ఇంటిలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడాన్ని చూడొచ్చు. మరోవైపు.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మూకాశ్మీర్‌లో మెగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు జరిగాయి. ఈ ర్యాలీలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జమ్మూ, కాశ్మీర్‌లలోని ప్రతి ఇంట్లో దేశభక్తిని , జాతీయవాద స్పూర్తిని నింపడం లక్ష్యంగా ఈ ర్యాలీలు జరిగాయి. 

జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రధాని నరేంద్ర మోడీ విజన్‌ను నెరవేర్చడంలో కాశ్మీర్ యువత ముందుకు సాగుతోందన్నారు. భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరడంలో దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే జమ్మూకాశ్మీర్ సహకారం కూడా వాటితో సమానంగా వుంటుందన్నారు. 

Scroll to load tweet…

కాగా.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గతేడాది జూలై 22న హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని ప్రారంభించారు. జాతీయ జెండాకు ఆ తేదీకి చారిత్రక ప్రాముఖ్యత వుందన్నారు. తాజాగా ఈ ఏడాది కూడా హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్‌ను ప్రధాని ప్రారంభించారు. ఇది జాతీయ జెండాతో మనకున్న అనుబంధాన్ని మరింతగా పెంచుతుందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ క్యాంపెయిన్ దేశంలోని పౌరులందరినీ వారి ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయమని ప్రోత్సహిస్తుంది. రెండవ ఎడిషన్ కూడా మునుపటి ఏడాది మాదిరిగానే ఆగస్ట్ 13 నుంచి ఆగస్ట్ 15 వరకు జరుపుకుంటున్నారు.