Asianet News TeluguAsianet News Telugu

భారత్ కౌంటర్‌కు ఇంగ్లాండ్ యూటర్న్..! ‘వ్యాక్సిన్ సర్టిఫికేషన్‌పై కేంద్రంతో చర్చిస్తున్నాం’

భారత్ ఇచ్చిన షాక్‌తో యూకే యూటర్న్ తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. సాంకేతికపరమైన అంశాల్లో సమన్వయం కోసం భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని, తద్వారా భారత కొవిడ్ టీకా సర్టిఫికేషన్‌ను గుర్తించడానికి వీలవుతుందని బ్రిటీష్ హైకమిషన్ స్పందించింది.
 

british highcommission to take u turn on india vaccine certification
Author
New Delhi, First Published Oct 2, 2021, 3:12 PM IST

న్యూఢిల్లీ: యూకే ప్రభుత్వానికి భారత్ గట్టి కౌంటర్ ఇచ్చాక పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. భారత్ దెబ్బకు యూకే యూటర్న్ తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. బ్రిటీష్ హైకమిషన్ స్పందించి భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. భారత ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేషన్‌ను గుర్తించడానికి చర్చలు జరుగుతున్నాయని వివరించింది.

సాంకేతికపరమైన సమన్వయం కోసం భారత ప్రభుత్వంతో ఇంకా సంప్రదింపులు జరుపుతున్నామని బ్రిటీష్ హైకమిషన్ వెల్లడించింది. తద్వారా భారత ప్రభుత్వం అందించిన టీకాలు వేసుకున్నవారి కొవిడ్ టీకా సర్టిఫికేషన్‌ను యూకే ప్రభుత్వం ఆమోదించడానికి వీలు చిక్కుతుందని వివరించింది.

 

గత నెల చివరి వారంలో యూకే ప్రభుత్వం విదేశీ ప్రయాణికులపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ ప్రభుత్వం 18 దేశాల టీకాలను గుర్తించి, ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని తెలిపింది. ఈ జాబితాలో భారత్ లేదు. తత్ఫలితంగా భారత్ నుంచి వెళ్లే ప్రయాణికులు యూకేలో తప్పనిసరిగా పది రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి.

యూకేలోనూ కొవిషీల్డ్ టీకా వేస్తున్నారు. యూకేలో కొవిషీల్డ్ టీకా వేసుకున్నవారిని వ్యాక్సినేటెడ్‌గా గుర్తించి, భారత్‌లో కొవిషీల్డ్ వేసుకున్నవారిని అన్‌వ్యాక్సినేటెడ్‌గా గుర్తించడంపై కేంద్రం మండిపడింది. వెంటనే నిబంధనలు సవరించాలని, లేదంటే ప్రతిఘటనా చర్యలు తప్పవని హెచ్చరించింది. యూకే నిబంధనలు ఈ నెల 4 నుంచి అమల్లోకి రానున్నాయి. 

యూకే నిబంధనల్లో మార్పులు లేకపోవడంతో భారత్ కూడా దానికి తగిన జవాబు ఇవ్వడానికి నిర్ణయించింది. యూకే ప్రభుత్వం భారత ప్రయాణికులపై విధించిన నిబంధనలే యూకే నుంచి భారత్ వస్తున్న ప్రయాణికులపై అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ మేరకు నిబంధనలు విడుదల చేసి, అవి కూడా అక్టోబర్ 4 నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. తాజాగా, ఈ నిబంధనలపై బ్రిటీష్ హైకమిషన్ పైవిధంగా స్పందించింది.

Follow Us:
Download App:
  • android
  • ios