Asianet News TeluguAsianet News Telugu

ఛాన్స్ దొరికినప్పుడల్లా బ్రిజ్ భూషణ్ సింగ్ రెజ్లర్లను వేధించారు - కోర్టుతో ఢిల్లీ పోలీసులు

అవకాశం దొరికిన ప్రతీ సారి డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ రెజర్లను వేధించారని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. కావాలనే రెజర్ల గౌరవానికి భంగం కలిగించారని అన్నారు. ఆయనకు వ్యతిరేకంగా మూడు రకాల సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Brij Bhushan Singh harassed wrestlers whenever he got a chance - Delhi Police told court..ISR
Author
First Published Sep 24, 2023, 11:01 AM IST

భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అవకాశం వచ్చిన ప్రతీ సారి తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా రెజ్లర్ల గౌరవానికి భంగం కలిగించారని ఢిల్లీ పోలీసులు శనివారం కోర్టుకు తెలిపారు. ఆరుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో ఛార్జీషీట్ దాఖలు చేసిన తర్వాత బ్రిజ్ భూషణ్ పై అభియోగాల నమోదు కోసం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు వాదనలు వింటోంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ వాదనలు వినిపిస్తున్నారు. డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ నకు ఆయన ఏం చేస్తున్నారో కూడా తెలుసునని, రెజ్లర్ల గౌరవానికి భంగం కలిగించడమే ఆయన ఉద్దేశమని కోర్టుకు తెలిపారు. శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా మూడు రకాల సాక్ష్యాధారాలు ఉన్నాయని, అవి అభియోగాలు మోపడానికి సరిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) కింద సెక్షన్లు 161 (పోలీసులు సాక్షులను విచారించడం), 164 (మేజిస్ట్రేట్ చేత రికార్డ్ చేసిన వాంగ్మూలాలు) కింద రాతపూర్వక ఫిర్యాదు, రెండు రికార్డ్ చేసిన వాంగ్మూలాలు ఇందులో ఉన్నాయి.

బ్రిజ్ భూషణ్ సింగ్ పై అభియోగాలు నమోదు చేసే అధికారం కోర్టు పరిధిలో ఉందని శ్రీవాస్తవ తెలిపారు. భారత్ వెలుపల జరిగే కేసులకు సీఆర్పీసీ సెక్షన్ 188 కింద అనుమతి అవసరమని డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ తరఫు న్యాయవాది చేసిన వాదనను ఆయన తిప్పికొట్టారు. గతంలో ఇచ్చిన తీర్పును అతుల్ శ్రీవాస్తవ ప్రస్తావిస్తూ.. అన్ని నేరాలు భారతదేశం వెలుపల జరిగితేనే అనుమతి అవసరమని వాదించారు. ఈ నేరాలు ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగాయని, అందువల్ల అనుమతి అవసరం లేదని ఆయన అన్నారు.

బ్రిజ్ భూషణ్ తరపు న్యాయవాది రాజీవ్ మోహన్ వాదనలు వినిపిస్తూ.. ఆ అనుమతి పొందితే తప్ప దేశం వెలుపల జరిగిన నేరాలపై నిర్ణయం తీసుకునే అధికారం ఢిల్లీ కోర్టుకు లేదని వాదించారు. ఈ కేసులో సాక్షులందరూ సహ నిందితుడైన వినోద్ తోమర్.. బ్రిజ్ భూషణ్ చర్యలకు సహకరించారని చెప్పారని శ్రీవాస్తవ కోర్టుకు తెలిపారు. డబ్ల్యూఎఫ్ఐ మాజీ అదనపు కార్యదర్శిగా సస్పెన్షన్ కు ముందు తోమర్ బ్రిజ్ భూషణ్ సింగ్ తో కలిసి రెజ్లింగ్ సంఘం రోజువారీ వ్యవహారాలు చూసుకున్నారు.

భారత శిక్షాస్మృతి (ఐపీసీ) లోని సెక్షన్లు 354 (మహిళ గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో దాడి లేదా క్రిమినల్ బలవంతం), 354 ఏ (లైంగిక వేధింపులు), 354 డీ (వెంబడించడం), 506 (క్రిమినల్ బెదిరింపు) కింద ఢిల్లీ పోలీసులు జూన్ 15 న ఛార్జీషీట్ దాఖలు చేశారు. అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ జూలై 20న బ్రిజ్ భూషణ్ సింగ్, సస్పెండ్ అయిన డబ్ల్యూఎఫ్ఐ అదనపు కార్యదర్శి వినోద్ తోమర్లకు బెయిల్ మంజూరు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios