బ్రిజ్ భూషణ్ మద్యం తాగి అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించాడు: ఢిల్లీ పోలీసులతో ఇంటర్నేషనల్ రెఫరీ జగ్బీర్
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఇంటర్నేషనల్ రెఫరీ జగ్బీర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించాడని, తాను స్వయంగా చూశానని చెప్పాడు. ఢిల్లీ పోలీసులకు ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో సంచలన ఆరోపణలు ఉన్నాయి.

న్యూఢిల్లీ: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మద్యం తాగి అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించడాన్ని తాను స్వయంగా చూశానని ఇంటర్నేషనల్ రెఫరీ జగ్బీర్ సింగ్ ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. 2013 నుంచి పలుమార్లు ఆయన మహిళా రెజ్లర్లతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ మన దేశ టాప్ రెజ్లర్లు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్ సహా పలువురు నిరసనలు చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను ఆ పదవిలో నుంచి తొలగించి వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
‘2007 నుంచి నేను యూడబ్ల్యూడబ్ల్యూ రెఫరీని. ఇప్పుడు నిరసనలు చేస్తున్న రెజ్లర్లు పుట్టక ముందు నుంచే నేను రెఫరీగా చేస్తున్నాను. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కూడా నాకు చాలా కాలం నుంచి తెలుసు.’ అని ఆయన తెలిపారు.
‘ఆ అమ్మాయిలు కేసు పెట్టే వరకు నేను పెద్దగా మాట్లాడటానికి అవకాశమే లేదు. నేను ఏమీ చేయలేని పరిస్థితి. కానీ, కొన్ని ఘటనలను నేను స్వయంగా నా కళ్లతో చూశాను. బాధపడ్డాను’ అని చెప్పారు. కోచ్ కమ్ ఇంటర్నేషనల్ రెఫరీ జగ్బీర్ సింగ్ మాట్లాడుతూ.. చాలా సందర్భాల్లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తప్పుగా ప్రవర్తించడాన్ని తాను స్వయంగా చూసినట్టు వివరించాడు.
‘కజక్‌స్తాన్ సెకండ్ టూర్ సమయంలో ఆయన ప్రెసిడెంట్ అయ్యాక అక్కడ మాకు భారత ఆహారం తినిపిస్తానని అన్నాడు. జూనియర్ రెజ్లర్ల హోటల్‌లో ఓ పార్టీ ఏర్పాటు చేశారు. బ్రిజ్ భూషణ్, థాయ్‌లాండ్‌కు చెందిన ఆయన సహచరులు ఫుల్‌గా మద్యం తాగారు. అక్కడ అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించారు. దీన్ని నేను స్వయంగా చూశాను’ అని చెప్పాడు.
‘2022లోనూ నేను ఓ ఘటన చూశాను. ప్రెసిడెంట్ మన దేశంలోని నేషనల్ టోర్నమెంట్ల కోసం తిరిగేటప్పుడు ఎప్పుడూ ఆయన వెంట ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉండటాన్ని చూశాను. కానీ, మేం అందుకు వ్యతిరేకంగా నిరసన చేయలేకపోయాం. మా కళ్లతో మేం వారిని చూశాం’ అని తెలిపాడు.
Also Read: Mumbai Murder: రెండు బకెట్ల నిండా రక్తం, కొన్ని ముక్కలను ఉడికించి, రోస్ట్ చేసి.. నిందితుడికి హెచ్ఐవీ
కానీ, లైంగిక ఆరోపణలను బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నిరాకరించాడు కదా.. అని ప్రస్తావించగా దొంగ ఎప్పుడైనా తాను దొంగ కాదనే అంటాడని వివరించాడు.
2022 మార్చి 25వ తేదీన ఓ ట్రయల్ తర్వాత ఫొటో సెషన్ నిర్వహించారని, అక్కడ ఓ బాలిక ప్రెసిడెంట్‌తో నిలబడి ఇబ్బందిగా ఫీల్ అయిందని, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిందనీ జగ్బీర్ సింగ్ వివరించాడు.