ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం లేదంటూ బీజేపీ ప్రకటించ్చింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం నిన్న గవర్నర్ బీజేపీ ని ఆహ్వానించినా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు వెళ్లి గవర్నర్ ను కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం లేధని తేల్చి చెప్పింది. 

ఇప్పటికే శివసేన ఎన్సీపీ తో కలవడానికి సిద్ధంగా ఉన్నామని బాహాటంగానే ప్రకటించింది. ఈ విషయమై తొలుత విముఖంగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సైతం ఇప్పుడు మద్దతిచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. 

శివసేన తమను అవమానించిందని తెలిపారు. ప్రజాతీర్పు బీజేపీ శివ సేనల కూటమికి అనుకూలంగా వచ్చిందని కాకపోతే తాము శివసేన మద్దతు పొందలేకపోయామని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమకు సంఖ్యా బలం లేనందున తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలేదని గవర్నర్ కు ఫడ్నవిస్ తెలిపారు. 

Also read: మహారాష్ట్ర: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి.. బీజేపీకి గవర్నర్ ఆహ్వానం

గవర్నర్ నిర్ణయం ఇప్పటికే ఆలస్యమైందని ఎన్‌సీపీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఒకవేళ  అసెంబ్లీలో బాల నిరూపణ కోసం పరీక్ష జరిగితే బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తామని ప్రకటించింది. ఎన్‌సీపీ ప్రధాన ప్రతినిధి నవాబ్ మాలిక్ ఆదివారం రోజున మీడియాతో మాట్లాడుతూ, బీజేపీకి వ్యతిరేకంగా శివసేన ఓటు వేస్తే ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుపై  తమ పార్టీ కూడా ఆలోచన చేయనున్నట్టు  తెలిపారు. 

ప్రభుత్వ ఏర్పాటు విషయంలో చొరవ చూపేందుకు గవర్నర్ ఇప్పటికే  ఆలస్యం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ సభ్యులకు మెజారిటీ ఉందా లేదా అనే విషయంలో గవర్నర్ త్వరగా ఒక నిర్ణయానికి రావాలన్నారు. 

Also read: "మహా గరం": ఆర్ఎస్ఎస్ రాజీ ఫార్ములా, ఫడ్నవీస్ వెనక్కి, తెరపైకి గడ్కరీ

బల నిరూపణకు ఒకవేళ బీజేపీ సిద్ధపడితే, బీజేపీ జరిపే తెరవెనుక బేరసారాలను అడ్డుకోవాలని, అటువంటి చర్యలకు పాల్పడకుండా గవర్నర్ కఠినంగా వ్యవహరించాలని ఆయన గవర్నర్ ని కోరారు. బలపరీక్షలో తమ పార్టీ మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తుందన్నారు. శరద్ పవార్ సమక్షంలో మంగళవారం నాడు ఎన్‌సీపీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేలు పవార్ నేతృత్వంలో సమావేశమవనున్నట్టు ఆయన తెలిపారు.

ఇకపోతే, శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మద్దతు ఇచ్చేందుకు ఎన్‌సీపీ సుముఖంగానే ఉన్నట్టు శరద్ పవార్ కుటుంబ సన్నిహిత వర్గాలు అంటున్నాయి.  శివసేన-ఎన్‌సీపీ కలిస్తే, బయట నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సోమవారంనాడు ఢిల్లీలో సమావేశమై ఈ విషయమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనంతరం మంగళవారం నాడు శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామంటూ ఉమ్మడి ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని ఎన్సీపీ అంతర్గత వర్గాలు చెబుతున్న సమాచారం.