Asianet News TeluguAsianet News Telugu

తల్లి ప్రేమ: అలసిన చిన్నారిని సూట్ కేసు పై లాక్కుంటూ 800 కిలోమీటర్లు

అలసి సొలసి ట్రాలీ సూట్ కేసు మీద పడి నిద్రపోతున్న ఒక కుర్రాడిని లాక్కెళుతున్న తల్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కడో పంజాబ్ లో ప్రయాణం మొదలుపెట్టు, అక్కడి నుండి ఝాన్సీ వరకు నడుచుకుంటూ బయల్దేరారు. 

Boy Sleeps On Suitcase Wheeled By Mother: Video Tells Migrants' Plight in India during the Lockdown
Author
Hyderabad, First Published May 14, 2020, 4:02 PM IST

అలసి సొలసి ట్రాలీ సూట్ కేసు మీద పడి నిద్రపోతున్న ఒక కుర్రాడిని లాక్కెళుతున్న తల్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కడో పంజాబ్ లో ప్రయాణం మొదలుపెట్టు, అక్కడి నుండి ఝాన్సీ వరకు నడుచుకుంటూ బయల్దేరారు. 

నడుస్తూ పూర్తిగా అలిసిపోయిన ఆ తల్లిని మధ్యలో జర్నలిస్టులతో ఆపి మాట్లాడడానికి ప్రయత్నిస్తే... మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేదు. కేవలం ఝాన్సీకి తామంతా వెళుతున్నాము అని చెప్పడం తప్పితే.... ఆ మహిళా వేరే ఏమి మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేదు. 

వారంతా పంజాబ్ రాష్ట్రం నుంచి కాలినడకన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ కి బయల్దేరారు. వారిని విలేఖరులు ఆగ్రా వద్ద గమనించి వారినుంచి వివరాలు అడిజి తెలుసుకునే ప్రయత్నం చేసారు.  

ఈ లాక్ డౌన్ వల్ల కలిగిన ఇబ్బందుల గురించి అర్థం చేసుకోవాలంటే... ఈ ఒక్క వీడియో చాలేమో. బస్సులున్నాయి కదా ఎందుకు వెళ్లడం లేదు అంటే... ఆ ప్రశ్నకు ఆ తల్లి సమాధానం కూడా చెప్పలేదు. బస్సులెక్కడున్నాయన్న నిస్సహాయత ఆ తల్లి కళ్ళలో కనబడింది. 

 లాక్ డౌన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు పయనమవుతున్నారు. ప్రభుత్వం నడిపే రవాణా సదుపాయాలు అందరికి సరిపోకపోవడం, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లేంత స్థోమత వారికి లేకపోవడం అన్ని వెరసి ఇలా వేల కిలోమీటర్లు ఈ ఎండలో నడుచుకుంటూ బయల్దేరారు. 

ఇక మరో సంఘటనలో.... హైదరాబాద్ నుండి మధ్యప్రదేశ్ లోని సొంతూరు బాలఘాట్ కు గర్భిణీ భార్య, కూతురితో బయల్దేరి నిన్న చేరుకున్నాడు ఒక వలస కార్మికుడు. అన్ని కష్టనష్టాలకోర్చి 700 కిలోమీటర్లను తన భార్యను, కూతురిని ఒక చిన్న చక్రాలతో సొంతగా తయారు చేసిన తోపుబు బండిపై లాక్కుంటూ చేరుకున్నాడు. 

వివరాల్లోకి వెళితే... రాము అనే ఒక వలస కార్మికుడు గర్భవతి అయిన భార్య ధన్వంత, కూతురు అనురాగిణితో కలిసి మధ్యప్రదేశ్ లోని తన సొంత ఊరికి చేరుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఎటువంటి రవాణా సదుపాయం లేకపోవడంతో కాలినడకన తన ప్రయాణాన్ని ఆరంభించాడు. 

కూతురిని భుజాన ఎత్తుకొని తన భార్యతో కలిసి నడవడం ఆరంభించాడు. కానీ ఇలా ఎక్కువసేపు తన గర్భవతిగా ఉన్న భార్యను నడిపించడం ప్రమాదం అని భావించిన రాము, మార్గమధ్యంలో అడవుల్లో దొరికిన కర్రలతో ఒక తోపుడు బండి లాంటిదాన్ని తయారు చేసాడు. 

అలా తయారుచేసిన చిన్న చక్రాల బండి పై భార్యను, కూతురిని కూర్చోబెట్టి దాదాపుగా 640 కిలోమీటర్లు ఇలా లాక్కుంటూ వెళ్ళాడు. అలా తెలంగాణ, మహారాష్ట్రలను దాటుకొంటూ మధ్యప్రదేశ్ లోని తన సొంత జిల్లాకు చేరుకోగానే... అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ వీరిని చూసి చలించి పోయాడు. వారికి మంచి నీరు, బిస్కెట్లను ఇచ్చి ఆ చిన్నారికి కొత్త చెప్పుల జతను కొనిచ్చాడు. 

అక్కడి నుండి ఆ పోలీసు అధికారి వారికి వైద్య పరీక్షలను నిర్వహించి వారి సొంతూరు వరకు ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి పంపించాడు.ఈ లాక్ డౌన్ ముగిసేసరికి ఇలాంటి ఇంకెన్ని గుండెల్ని కలిచివేసే ఘటనలు చూడాలో!

Follow Us:
Download App:
  • android
  • ios