భోపాల్: భోపాల్ లోని అవధిపురా ప్రాంతంలో ఊరకుక్కలు ఆరేళ్ల బాలుడిని చంపేశాయి. తల్లి కళ్లెదుటే ఈ దారుణం జరిగింది. శవసంగ్రామ్ నగర్ లోని తన ఇంటికి 300 మీటర్ల దూరంలోని ఖాళీ ప్రదేశంలో ఆడుకుంటుండగా బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. 

కుమారుడిని రక్షించడానికి తల్లి చేసిన ప్రయత్నం ఫలించలేదు.  గత నెలలో పాపకు జన్మనిచ్చింది. ప్రసవం సమయంలో ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. దీంతో ఆమె ఇంటి వద్దే ఉంటోంది. ఇంటికి వచ్చిన భర్త కొడుకు గురించి అడిగాడు. 

దాంతో ఆమె బయటకు వచ్చి చూసి అవాక్కయింది. కొడుకుని కుక్కలు చుట్టుముట్టి ఉన్నాయి. ఆమె కేకలు వేస్తూ సాయం కోసం అరుస్తూ ఇంట్లోకి వెళ్లింది. దాంతో ఇరుగుపొరుగు వారు గుమికూడారు. బాలుడు సంజూ స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించాడు. 

మున్సిపల్ కార్పోరేషన్ పై స్థానికులు భగ్గుమంటున్నారు. తమ ప్రాంతంలో ఊరకుక్కలు మితిమీరిపోతున్నాయని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.