మహారాష్ట్ర ప్రభుత్వంపై బొంబాయ్ హైకోర్టు సీరియస్ అయింది. గ్రామాల్లో హెలిప్యాడ్లు ఉంటున్నాయ్ గానీ.. రోడ్లు, బ్రిడ్జీలు ఉండట్లేవని ఆగ్రహించింది. వెంటనే వీటి కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. స్కూల్ విద్యార్థినులు పాఠశాలకు వెళ్లడానికి పడుతున్న అవస్థలపై ప్రచురితమైన కొన్ని వార్తా కథనాల ఆధారంగా కోర్టు సుమోటు కేసు విచారిస్తున్నది.
ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వంపై బొంబాయ్ హైకోర్టు సీరియస్ అయింది. గ్రామ ప్రజలకు రోడ్లు, బ్రిడ్జీల వంటి మౌలిక వసతులను కల్పించలేకపోతున్నదని ఫైర్ అయింది. మీడియా రిపోర్టులు ఆధారంగా ఓ సుమోటు కేసును విచారిస్తూ బొంబాయ్ హైకోర్టు మండిపడింది.
సతారా జిల్లాలో చిన్నారి విద్యార్థినులు స్కూల్ వెళ్లడానికి కొయనా డ్యామ్ దాటాల్సి వస్తున్నది. అంతేకాదు, ఆ తర్వాత దట్టమైన అడవుల గుండా ప్రయాణించి స్కూల్‌కు వెళ్లాల్సి వస్తున్నది. ఆ దట్టమైన అడవిలో జంతువులూ ఉన్నట్టు కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. ఈ వార్తా కథనాల ఆధారంగా బొంబాయ్ హైకోర్టులో సుమోటు కేసు దాఖలైంది.
ఈ సుమోటు పిటిషన్ విచారిస్తూ.. ఆ విద్యార్థులు స్కూల్‌కు వెళ్లడానికి పడుతున్న కష్టాలను పేర్కొంది. నాలుగు కిలోమీటర్లు దట్టమైన అడవి గుండా ప్రయాణించి వస్తున్న విధాన్నీ గుర్తు చేసింది.
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సతారాకు చెందినవాడే. ఆయన గ్రామంలో రెండు హెలిప్యాడ్లు కూడా ఉన్నాయి.
హెలిప్యాడ్ల నిర్మాణాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ, కనీస వసతులైన రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణం చేపట్టాల్సిందని కోర్టు పేర్కొంది. స్కూల్‌కు వెళ్లే విద్యార్థుల కోసం రోడ్లు నిర్మించాలని, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్ర ఆర్థిక, విద్యా శాఖ, సోషల్ జస్టిస్ డిపార్ట్‌మెంట్, రూరల్ డెవలప్‌మెంట్‌లు అన్నీ కలిసి సమన్వయంలో పని చేసి ఇలాంటి సమస్యలను పరిష్కరిస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపింది.
ఈ సమస్యకు పరిష్కారాలపై ఆగస్టు 30వ తేదీలోపు సమగ్రమైన వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించాలని ఆదేశించింది. డిప్యూటీ సెక్రెటరీ ర్యాంక్ అధికారి అఫిడవిట్ దాఖలు చేయాలని తెలిపింది.
