రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబ్ బెదిరింపు మెయిల్ కలకలం రేపుతోంది.  

RBI : భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన కేంద్ర ప్రభుత్వ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాంటి సంస్థకు తాజాగా బాంబ్ బెదిరింపు వచ్చింది. ఇవాళ(శుక్రవారం) రష్యా నుండి ఆర్బిఐకి ఓ మెయిల్ వచ్చింది... ముంబై లోని ఆర్బిఐ కార్యాలయంపై దాడి జరగనుందని... భారీ పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టించనున్నట్లు తెలిపాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆర్బిఐ గవర్నర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సంజయ్ మల్హోత్రా అధికారిక మెయిల్ ఐడీకి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇది రష్యన్ బాషలో వుంది. ఈ బాంబ్ బెదిరింపు నేపథ్యంలో ముంబై లోని ఆర్బిఐ కార్యాలయంలో భద్రతను కట్టుదిట్టం చేసారు. ఇప్పటకే బాండ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు.

ఇలా ఆర్బిఐ కార్యాలయానికి బాంబ్ బెదిరింపు మెయిల్ కలకలం సృష్టిస్తోంది. దీనిపై ముంబైలోని రమాబారు మార్గ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఇది ఎవరైనా ఆకతాయిల పనా లేక నిజంగానే ఆర్బిఐపై దాడులకు కుట్రలు జరుగుతున్నాయా అన్నది తెలియాల్సి వుంది.