Bollywood Stars: ఢిల్లీ-NCRలోని స్ట్రే డాగ్స్‌ను షెల్టర్ హోమ్స్‌కి తరలించాలనే సుప్రీంకోర్టు తీర్పుపై జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ వంటి బాలీవుడ్ స్టార్స్  అసంతృప్తి వ్యక్తం చేశారు. జంతువుల పట్ల కరుణ చూపాలని కోరారు.

DID YOU
KNOW
?
వీధి కుక్కలు-భారత చట్టాలు
భారత్‌లో వీధి కుక్కలను హాని చేయడం లేదా చంపడం నేరం. చట్టం ప్రకారం స్టెరిలైజేషన్, టీకాలు వేసి తిరిగి వాటి ప్రదేశంలో వదిలివేయాలి.

Bollywood Stars: సుప్రీంకోర్టు ఇటీవల వీధి కుక్కలను షెల్టర్ హోమ్‌లకు తరలించాలని ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, జంతు ప్రేమికులను నిరాశ‌కు గురిచేసింది. దీనిపై అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. బాలీవుడ్ నటులు జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ ఈ తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అన్యాయమనీ, మూగజీవాలపై కరుణ చూపాలని, వాటిని నిర్బంధంలో ఉంచడం సరైనది కాదని పేర్కొన్నారు. కుక్కలు దాడి చేయండ‌, భద్రతా సమస్యలపై ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈ తీర్పు ఇచ్చామని కోర్టు పేర్కొంది. అయితే, ఇది దేశవ్యాప్తంగా మూగ‌జీవాల విష‌యంలో కొత్త చ‌ర్చకు దారితీసింది.

బాలీవుడ్ సెలబ్రిటీల అసంతృప్తి

సుప్రీంకోర్టు తీర్పుపై బాలీవుడ్ తారలు జాన్వీ కపూర్, వరుణ్ ధావన్, ధనశ్రీ వర్మ వెంటనే సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. జాన్వీ తన భావోద్వేగపూరితమైన పోస్టులో వీధి కుక్కలను నగర హృదయ స్పందనగా అభివర్ణించారు. వాటిని షెల్టర్లలో బంధించడం స‌రైంది కాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. "అవి టీ స్టాల్స్ బయట బిస్కెట్ల కోసం ఎదురుచూస్తుంటాయి, రాత్రిపూట దుకాణాలకు కాపలాగా ఉంటాయి. పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తిరిగి స్వాగతిస్తాయి. వాటిని వీధుల్లోంచి తొలగించడం దయ కాదు, అది బహిష్కరణ" అని ఆమె ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని పరిష్కారాలు

వరుణ్ ధావన్, ధనశ్రీ వర్మ కూడా జాన్వీ అభిప్రాయానికి మద్దతు తెలిపారు. ధనశ్రీ వర్మ పౌరులను వీధి కుక్కలను దత్తత తీసుకోవాలని, స్థానిక షెల్టర్లకు విరాళాలు ఇవ్వడం ద్వారా వాటిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కుక్కలను తరలించడం కంటే మెరుగైన పరిష్కారాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. వాటికి సామూహిక స్టెరిలైజేషన్, టీకాల కార్యక్రమాలు, కమ్యూనిటీ ఫీడింగ్ వంటివి అమలు చేయాలని ఆమె సూచించారు. వీటివల్ల సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

సాంస్కృతిక ప్రాముఖ్యతపై రూపాలి గంగూలీ వ్యాఖ్యలు

టెలివిజన్ నటి రూపాలి గంగూలీ కూడా ఈ తీర్పుపై స్పందించారు. భారతీయ సంప్రదాయాలలో కుక్కలకు ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఆమె తన ఫాలోవర్లకు గుర్తు చేశారు. "కుక్కలు భైరవుని దేవాలయాలకు కాపలాగా ఉంటాయి. శతాబ్దాలుగా అవి మనల్ని రక్షించాయి. వాటిని తొలగించడం అంటే అగ్ని ప్రమాదం ముందు అలారం ఆఫ్ చేసినట్లు ఉంటుంది" అని ఆమె పోస్ట్ చేశారు.

ప‌లు చోట్ల నిర‌స‌న‌లు

ఈ తీర్పుపై జంతు సంక్షేమ సంఘాలు, కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల సంఖ్యలో కుక్కలను తరలించడం వల్ల షెల్టర్లు రద్దీగా మారి, వాటిపై నిర్లక్ష్యం, చివరికి మరణాలకు దారితీయవచ్చని అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతేకాకుండా, ఇది సమస్యకు మూల కారణాన్ని పరిష్కరించద‌నే వాద‌న‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే ఢిల్లీలో నిరసనలు జరిగాయి.

ప‌లువురు నిర‌స‌న‌లు తెలుప‌గా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స‌మాచారం.