తాను ప్రధానిని అవుతానని అస్సలు అనుకోలేదని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.  మోదీని బుధవారం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో మోదీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని అనుకున్నట్లు చెప్పారు.

రాజకీయాల గురించి మాట్లాడటం తనకు పెద్దగా ఆసక్తి గా ఉండదని.. దానికన్నా ఇతర విషయాల గురించి మాట్లాడటమే తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు. బయోగ్రఫీలు చదవడమంటే చాలా ఇష్టమని మోదీ తెలిపారు.
 
తనకు రామకృష్ణ మిషన్‌  స్ఫూర్తి అని చెప్పారు.  తాను సన్యాసి కావాలనుకున్నానని చెప్పారు. తాను తన ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకుంటానని... కఠినంగా ఉంటానని.. కానీ ఎవ్వరినీ అవమానించనని పేర్కొన్నారు. ఒత్తిడిలో పనిచేయడం అలవాటు చేసుకున్నానన్నారు.

 క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకున్నానని మోదీ తెలిపారు. తాను స్వయంగా పనిచేస్తూ... అందరితో పని చేయిస్తుంటానని పేర్కొన్నారు. తాను పనిచేయడం చూసి తన చుట్టూ ఉన్న అధికారులు కూడా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాల్లో కూడా తనకు చాలా మంది మిత్రులున్నారని మోదీ వెల్లడించారు.