ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయిన బాలీవుడ్ నటి నుష్రత్ భరూచా.. టీమ్ తో తెగిపోయిన సంబంధాలు..
ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో మన దేశానికి చెందిన బాలీవుడ్ నటి నుష్రత్ భరూచా అక్కడ తప్పిపోయారు. ఆమె తన టీమ్ నుంచి పూర్తిగా సంబంధాలు కోల్పోయారు. నుష్రత్ ను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఆమె టీమ్ ప్రయత్నాలు చేస్తోంది.
ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య వివాదం కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. హమాస్ ఇజ్రాయెల్ పై బాంబుల వర్షం కురిసిస్తోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో బాలీవుడ్ నటి నుష్రత్ భరూచా ఇజ్రాయెల్లో చిక్కుకుపోయారు. ఇటీవల హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఆమె ఆ దేశానికి వెళ్లారు. అయితే నుష్రత్ కు, ఆమె టీమ్ తో సంబంధాలు పూర్తి తెగిపోయాయి. ఆమె జాడ కోసం టీమ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.
‘ఇండియా టీవీ’ నివేదిక ప్రకారం.. నుష్రత్ భరూచాకు, ఆమె టీమ్ కు మధ్య చివరి సారిగా శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు చివరి సారిగా సంభాషణ జరిగింది. అప్పుడు ఆమె బేస్మెంట్లో అందరితో పాటు సురక్షితంగా ఉన్నానని తన టీమ్ మెంబర్ కు తెలిపింది. తరువాత ఆమె నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. నుష్రత్ ను సురక్షితంగా భారత్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని టీమ్ మెంబర్ పేర్కొన్నారు. ఎలాంటి గాయాలు లేకుండా తిరిగి వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ప్రణయ్ మెష్రామ్ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ డ్రామా అకెల్లిలో ఈ 38 ఏళ్ల నటి నుష్రత్ భరూచా చివరి సారిగా కనిపించారు. అందులో ఆమె ఓ పోరాట ప్రాంతంలో చిక్కుకుని సురక్షితంగా బయటకు రావడానికి కష్టపడే ఒక సాధారణ భారతీయ అమ్మాయి పాత్రలో నటించింది. అయితే దురదృష్టవశాత్తూ ఇప్పుడు కూడా ఆమె రియాలిటీలో అలాంటి పరిస్థితుల్లోనే చిక్కుకున్నారు. ఆమె సురక్షితంగా భారత్ కు తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ కు భారత్ అండగా నిలిచింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం స్పందించారు. ఇజ్రాయెల్ లో ఉగ్రదాడుల వార్తలతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ట్వీట్ చేశారు. ‘‘మా ఆలోచనలు, ప్రార్థనలు అమాయక బాధితులకు, వారి కుటుంబాలకు అండగా ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో ఇజ్రాయెల్ కు సంఘీభావం తెలుపుతున్నాం’’ అని పేర్కొన్నారు.