Asianet News TeluguAsianet News Telugu

నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని భుజంపై మోస్తూ నడక.. ఆ తరువాత బస్సులో ప్రయాణం.. వైరల్..

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఓ హృదయవిదారకమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని భుజంపై మోసుకుంటూ ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించాడు. బస్టాండ్ వరకు  నడుచుకుంటూ వెడుతున్న ఫొటో వైరల్..

Body On Shoulder,Man Walks On Busy Road To Bus Stop in  Madhya Pradesh
Author
First Published Oct 20, 2022, 1:57 PM IST

భోపాల్ : కనీస సదుపాయాలు అందక పేదలు మారుమూల ప్రాంతాల ప్రజలు హృదయ విదారక పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి చనిపోయిన నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని మోసుకుంటూ బస్టాండ్ వరకు వెళ్ళాడు.  తన ఊరు చేరుకోవడానికి ఇతర ప్రయాణికుల మాదిరిగానే బస్సులో ప్రయాణించాడు. మృత దేహంతో పాటు అతడు నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. 

ఓ నాలుగేళ్ల చిన్నారి తన స్వగ్రామంలో ప్రమాదవశాత్తు మృతి చెందింది. దీంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఛాతర్ పుర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ తిరిగి వచ్చే సమయంలో చిన్నారి సమీప బంధువు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నాడు. మృతదేహాన్ని తరలించడానికి ఆస్పత్రి వద్ద ఎటువంటి వాహనం అందుబాటులో లేదు. మరో పక్క ప్రైవేటు వాహనంలో ఊరికి వెళ్లేందుకు సరిపడా డబ్బులు అతని దగ్గర లేవు.

దీంతో చిన్నారి మృతదేహాన్ని భుజం మీద మోసుకుంటూ బస్టాండ్ వద్దకు వెళ్ళాడు. అందరు ప్రయాణికులతో పాటే తన ఊరు వెళ్లే బస్సు ఎక్కాడు. టికెట్ కొనేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో  తోటి ప్రయాణికుడు ఒకరు సహాయం చేశారు. కొద్ది నెలల క్రితం అదే ఆసుపత్రికి వచ్చిన ఓ కుటుంబానికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ వరుస ఘటనల నేపథ్యంలో ఛాతర్ పూర్ ప్రాంతంలో అత్యవసర సదుపాయాలు అందుబాటుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

చెడ్డీ, టవల్ తో కాలేజీకి.. ఓ నిజ జీవిత మోగ్లీ ఇతడు.. ఇంతకీ ఎక్కడంటే...

ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేక తన కుమార్తె మృతదేహాన్ని భుజంపై మోసుకుంటూ 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన హృదయ విదారక ఘటన ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లాలో మార్చినెలలో చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనపై  రాష్ట్ర ఆరోగ్య మంత్రి విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి  పెడితే…జిల్లాలోని  అందాలా గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్ ఏడేళ్ల కుమార్తె అనారోగ్యానికి గురైంది. 

కొద్ది రోజుల నుంచి తీవ్ర జ్వరంతో  బాధపడుతుండటంతో  స్థానిక వైద్యుల వద్దకు తీసుకెళ్లారు.  అయినప్పటికీ తగ్గకపోవడంతో శుక్రవారం కాన్పూర్లోని  కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించింది. ఆక్సిజన్ స్థాయిలు 60కి పడిపోయాయి. వైద్యులు చికిత్స అందించినప్పటికీ చిన్నారి ప్రాణాలు దక్కలేదు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.. అయితే, మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేదు. దీంతో ఈశ్వర్ దాస్ కుమార్తె మృతదేహాన్ని భుజాన మోసుకొని పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగ్రామానికి నడుచుకుంటూ వెళ్ళాడు. 

రోడ్డుపై ఈశ్వర్ నడుచుకుంటూ వెళుతూ ఉండగా కొందరు తీసిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారడంతో  ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే స్పందించిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ దేవ్ ఘటనపై విచారణకు ఆదేశించారు.  బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది భిన్న వ్యాఖ్యలు చేశారు. అంబులెన్స్ వస్తుందని తాము చెప్పినప్పటికీ ఆ కుటుంబం వినకుండా వెళ్లిపోయిందని రూరల్ మెడికల్ అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్ భార్గవ్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios