రాజీవ్ గాంధీ హత్యతో రాజకీయాలు చేసిన వీళ్లా ప్రశ్నించేది.. : కాంగ్రెస్ కు అఖిలేశ్ మిశ్రా చురకలు
ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటలయుద్దం సాగుతున్న విషయం తెెలిసిందే. ఈ క్రమంలో ఈసిఐ బిజెపికి అనుకూలంగా వ్యవరహరిస్తుందన్న ఆరోపణలపై అఖిలేశ్ మిశ్రా స్పందించారు. ఆయన ఏమన్నారంటే...
న్యూడిల్లీ : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. మొత్తం ఏడు దశల్లో లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటికే ఐదుదశల పోలింగ్ ముగిసింది... త్వరలోనే మిగతా రెండు దశలు కూడా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా వుంటాయి? కేంద్రంలో అధికారాన్ని చేపట్టేది ఎవరు? అని యావత్ దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే నరేంద్ర మోదీ మేనియా, అయోధ్య రామమందిర నిర్మాణం, గత పదేళ్ల బిజెపి సుపరిపాలన, ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేత నిర్ణయాలు... ఇలా ఎన్నో చర్యలు బిజెపి గెలుపును ఖాయం చేసాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. మళ్లీ అధికారం బిజెపిదే అని ప్రతిపక్షాలు కూడా భావిస్తున్నట్లున్నాయి... అందుకోసమే ఓ కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. భారత ఎన్నికల సంఘం బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల నాయకులు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి పార్టీలకు బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సీఈవో అఖిలేష్ మిశ్రా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
రాజీవ్ గాంధీ హత్యతో కాంగ్రెస్ పాలిటిక్స్ :
భారత ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు గతంలో ఎలా వ్యవహరించారో గుర్తుచేసారు అఖిలేశ్ మిశ్రా. రాజీవ్ గాంధీ హత్యను కాంగ్రెస్ రాజకీయాల కోసం వాడుకుందని... ఇందుకు ఆనాటి ఎలక్షన్ కమీషన్ కూడా సహకరించిందని తెలిపారు. ఆనాడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎలక్షన్ కమీషన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు అఖిలేశ్ మిశ్రా.
నిజానికి ఎన్నికల సమయంలో ఎవరైనా అభ్యర్థి మరణిస్తే కేవలం ఆ ఒక్క స్థానంలోనే ఎన్నికలు రద్దు చేయాలి. మిగతా చోట్ల యధావిధిగా ఎన్నికలు నిర్వహించవచ్చు. అభ్యర్థి మరణించిన స్థానంలో ప్రత్యేకంగా మరో తేదీన పోలింగ్ నిర్వహించాలి. ఎన్నికల సంఘం నిబంధనలు ఇదే చెబుతున్నాయి. కేవలం ఒక్క సీటు కోసమే మొత్తం ఎన్నికలను వాయిదా వేయాలనే రూల్ లేదు. కానీ రాజీవ్ గాంధీ హత్యానంతరం నిబంధనలు విరుద్దంగా నిర్ణయాలు తీసుకున్నారని... కాంగ్రెస్ ఒత్తిడితోనే ఈసి నిర్ణయాలు తీసుకుందని మిశ్రా ఆరోపించారు.
1991 లోక్ సభ ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు... దీంతో మొత్తం ఎన్నికలు మూడు వారాల పాటు వాయిదా పడ్డాయని మిశ్రా గుర్తుచేసారు. ఆనాడు ఈసి తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎన్నికల వాయిదాను ఆనాటి ఏడుగురు ముఖ్యమంత్రులు వ్యతిరేకించారని తెలిపారు. ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని చాలామంది ఆందోళన వ్యక్తం చేసారని మిశ్రా తెలిపారు.
అయితే కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడైన ఆనాటి ప్రధాన ఎన్నికల అధికారి టి.ఎన్. శేషన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించాడని మిశ్రా ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలను కూడా తీసుకోకుండా సిఈసి ఎన్నికలను మూడు వారాలపాటు వాయిదా వేసారు. ఈ సమయంలోనే రాజీవ్ గాంధీ హత్యపై ప్రజల్లో భావోద్వేగాలను పెంచి సానుభూతి ఓట్లను పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీతో సానుభూతి లభించేలా ప్రకటనలు ఇప్పించారన్నారు. చివరకు రాజీవ్ అంతిమయాత్రను కూడా ఓట్ల కోసం వాడారని ఆరోపించారు. ఇలా ఎలక్షన్ కమీషన్ ను కాంగ్రెస్ పార్టీ ఎలా వాడుకుందో అఖిలేశ్ మిశ్రా గుర్తుచేసారు.
రాజీవ్ హత్యకు ముందు ఇదీ పరిస్థితి...
రాజీవ్ గాంధీ హత్యకు ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా వుందని మిశ్రా తెలిపారు. ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వుంది... ఆ పార్టీ గెలుపుపై ఆశలే లేకుండాపోయాయట. అలాంటి సమయంలో రాజీవ్ హత్య పరిస్థితిని పూర్తిగా మార్చివేసిందన్నారు అఖిలేశ్ మిశ్రా. ఎలక్షన్ కమీషన్ సాయంతో ఎన్నికలను వాయిదా వేయించుకోగలిగిన కాంగ్రెస్ ఆసయంలో సానుభూతి రాజకీయాలు చేసింది. వారి ప్రయత్నాలు పలించి పరిస్థితి తారుమారు అయ్యిందని... కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిందని అఖిలేశ్ మిశ్రా తెలిపారు.
ఎన్నికల అధికారి శేషన్ చేసిన సాయాన్ని కూడా గుర్తించిందని... అందువల్లే ఆయనను రాజకీయంగా అవకాశాలు ఇచ్చిందన్నారు. బిజెపి సీనియర్ నేత ఎల్కే అద్వానీపై శేషన్ ను బరిలోకి దింపింది కాంగ్రెస్. ఇలా కాంగ్రెస్ హయాంలో ఎలక్షన్ కమీషన్ దారుణంగా వ్యవహరించిందన్నారు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమీషన్ ను విమర్శించే ముందు తమ గత చరిత్రను కాంగ్రెస్ నాయకులు గుర్తుచేసుకోవాలని అఖిలేశ్ మిశ్రా సూచించారు.
రాజీవ్ గాంధీ హత్యకు ముందు పార్లమెంట్ హంగ్ అసెంబ్లీ దిశగా పయనిస్తోందని అఖిలేష్ మిశ్రా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి దిశగా పయనిస్తే, ప్రతిపక్షాలు ముఖ్యంగా బీజేపీ అధికారానికి గట్టి పోటీదారుగా ఎదుగుతున్న సమయమది... కానీ రాజీవ్ గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి లబ్ది పొందింది. సానుభూతి ఓట్లు పొందడానికి ఎన్నికలను వాయిదా వేయించుకుంది... ఈ సమయంలో పోల్ మేనేజ్ మెంట్ చేసి గెలిచిందని అఖిలేశ్ మిశ్రా ఆరోపించారు.