ఐదు రాష్ట్రాల ఎన్నికలపై భారీగా ఆశలు పెట్టుకున్న బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ షాకిచ్చాయి. ఒక్క అస్సాం తప్పితే ఎక్కడా బీజేపీ అధికారంలోకి రావని సర్వేలు రావడంతో కమల నాథుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 

దేశంలోని ఐదు రాష్ట్రాలకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జాతీయ మీడియా సంస్థలు గురువారం ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేశాయి. తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే క్లీన్ స్వీప్ చేస్తుందని దాదాపు సర్వేలు తేల్చి చెప్పాయి.

ఇక కేరళలో మళ్లీ లెఫ్ట్ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. పుదుచ్చేరిలో అనూహ్యంగా బీజేపీ అధికారంలోకి రాబోతున్నట్లు కొన్ని సంస్థలు ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో ఎక్కువ మందిని ఆకర్షించిన పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ మమతదే అధికారం అని దాదాపు సర్వేలన్నీ తెలిపాయి.

అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికలపై భారీగా ఆశలు పెట్టుకున్న బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ షాకిచ్చాయి. ఒక్క అస్సాం తప్పితే ఎక్కడా బీజేపీ అధికారంలోకి రావని సర్వేలు రావడంతో కమల నాథుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 

Also Read:West Bengal Exit Poll Result 2021: బెంగాల్ హోరాహోరీ, మమతవైపే అధిక సర్వేలు మొగ్గు

ఇదే సమయంలో ఎగ్జిట్ పోల్స్‌పై భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరి ప్రదర్శించింది. పశ్చిమ బెంగాల్ బీజేపీ ఇంచార్జ్ కైలాశ్ విజయవర్గీయ మాట్లాడుతూ.. అస్సాంలో బీజేపీ అధికారంలోకి రానుందన్న ఫలితాలపై ఏకీభవిస్తూనే బెంగాల్‌లో మమతకు అనుకూలంగా ఫలితాలు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సర్వే సంస్థలు క్షేత్ర స్థాయిలో సర్వే చేయకుండా అంచనాలు కట్టాయని కైలాశ్ ఎద్దేవా చేశారు. వాస్తవ పరిస్థితులు వేరేలా ఉన్నాయని.. ఈ ఎన్నికల్లో సైలెంట్ పోలింగ్ ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

18-20 శాతం వరకు ఈ ఓటర్లు ఉంటారని.. 2011లో కూడా వామపక్షాలదే మళ్లీ అధికారం అని చెప్పారని.. కానీ టీఎంసీ అధికారంలోకి వచ్చిందని కైలాశ్ విజయవర్గీయ గుర్తుచేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో కూడా బీజేపీ బెంగాల్‌లో 18 లోక్‌సభ సీట్లు గెలుస్తుందని ఎవరూ ఊహించలేదని ఆయన వెల్లడించారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందని కైలాష్ విజయవర్గీయ జోస్యం చెప్పారు.

ఇదే సమయంలో అస్సాం ఎగ్జిట్‌ పోల్స్‌ను ఆయన స్వాగతించారు. సర్వే సంస్థలు ప్రకటించిన ఫలితాలు వాస్తవమని.. అస్సాంలో అధికారం మళ్లీ బీజేపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే విజయ వర్గీయ ద్వంద్వ వైఖరిపై విపక్షాలు, నెటిజెన్లు మండిపడుతున్నారు. తమకు అనుకూలంగా ఫలితాలు వస్తే సరైనవని, వ్యతిరేకంగా వస్తే తప్పు పట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.